సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు ఖాళీగా ఉన్న కమిటీలను త్వరితగతిన భర్తీ చే యాలని నిర్ణయించింది. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందాలని నిర్ణయించింది.
సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ కమిటీల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఇకపై సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు చేపట్టాలని, ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని నేతలు నిర్ణయించారు.
ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి: ఈసీ శేఖర్‌గౌడ్
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై పదవులకోసం పాకులాడుతూ ప్రజావసరాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనుబంధ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు సాధించాలంటే జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు.
ప్రజలసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి సమన్వయకర్తలు కష్టపడాలన్నారు. పార్టీతరఫున పదవులు పొందిన నేతలంతా అనుక్షణం ప్రజల్లోనే ఉండాలన్నారు. త్వరలో జిల్లాలో పార్టీ అధ్వర్యంలో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పార్లమెంటు పరిశీలకులు జంపన ప్రతాప్, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం కన్వీనర్ జి.సురేష్‌రెడ్డి, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచంపల్లి కొండల్‌రెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, కొలను శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రావు, సూర్యనారాయణరెడ్డి, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, దశరథగౌడ్ తదితరులు పాల్గొన్నారు.