అంతా... పథకం ప్రకారమే
► వారంతా కుమ్ముక్కయ్యారు
► చేతులు మారిన రూ.3 కోట్లు
► ఆ రెండు రాత్రుల్లో టేకు చెట్ల నరికివేత
► నివేదిక కోరిన కేంద్ర అటవీ, పర్యావరణశాఖ
► కేసును నీరుగార్చే పనిలో టీడీపీ నేతలు
తిలాపాపం.. తలాపిడికెడు అన్నచందంగా టేకుచెట్ల నరికివేతలోఅధికారులు పాత్ర బయటపడింది. శ్రీవేదగిరి నరసింహస్వామిదేవస్థాన భూముల్లో ఉన్న విలువైన టేకు, మామిడి, కొబ్బరి, వేప చెట్లను టీడీపీ నాయకుడు నరికివేసిన విషయం తెలిసిందే. అందులో కొందరు రెవెన్యూ, అటవీ, దేవాదాయశాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. టీడీపీ నేతతో కుమ్ముక్కైన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి దేవుడికే శఠగోపం పెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవతో ఈ బాగోతం వెలుగుచూసింది. అయితే టీడీపీ ముఖ్యనాయకుల ఒత్తిళ్లతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగువేస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూముల్లోని విలువైన టేకుచెట్ల నరికివేతలో భాగం పంచుకున్న అధికారులు, లీజుదారులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి పొంగూరు నారాయణకు ఫిర్యాదుచేశారు. భూములు లీజు పొందినప్పటి నుంచి, నకిలీ పత్రాలతో టేకు చెట్ల నరికివేత వంటి అక్రమాలతో కూడిన నివేదికను గురువారం మంత్రి నారాయణకు అందజేశారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు రూరల్ పరిధిలో వెలిసిన శ్రీవేదగిరి నరసింహస్వామి మాన్యం భూముల్లోని రూ.కోట్లు విలువచేసే టేకు, వేప, మామిడి, కొబ్బరిచెట్లపై కన్నేసిన టీడీపీ నేత వేమిరెడ్డి హరిశివారెడ్డి అధికారుల సహకారంతో నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించాడు. సర్వేనంబర్ 262/1, 263/1, 264, 265లో ఉన్న 30.12 ఎకరాలను లీజుద్వారా దక్కించుకున్నాడు. అందులో భాగంగా 249, 255, 262 సర్వే నంబర్లతో పాటు మరో 24 నంబర్లను చూపి అందులో 375 టేకుచెట్లు ఉన్నాయని పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి అనుమతి కోరారు.అయితే 132, 133, 134, 135 సర్వే నంబర్లతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జతచేశారు. అయితే ఇవి నకిలీ పాసుపుస్తకాలని రెవెన్యూ అధికారి ఒకరు వెల్లడించారు.
అనుమతులు ఇచ్చిన పత్రాల్లో ఉన్న సర్వేనంబర్లలో ఎందులో ఎన్ని టేకుచెట్లు ఉన్నాయనే విషయం, హద్దులు చూపించలేదు. అయితే 262/1లో 5.9 ఎకరాల్లో 359 టేకుచెట్లను కొట్టుకుని తరలించేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్వేనంబర్‌లో టేకుచెట్లు ఉన్నట్లు అధికారులు ఎక్కడా ధ్రువీకరించలేదు. ఎక్కడ టేకుచెట్లు ఉన్నాయో రెవెన్యూ, అటవీ, దేవాదాయశాఖ అధికారులు తెలిసే శ్రీనరసింహస్వామి ఆలయభూముల్లో ఉన్న టేకుచెట్లను తరలించి సొమ్ముచేసుకునేందుకు పథకం వేసినట్లు సమాచారం.
ఆ రెండు రాత్రుల్లో చెట్ల నరికివేత :
చెట్లను ఈనెల 7, 8 తేదీల్లో నరికివేసినట్లు స్థానికులు చె బుతున్నారు. ఆ రెండు రోజుల రాత్రుల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసుకుని రంపాలతో చెట్లను కోసివేసి తరలించినట్లుగా తెలిసింది. వాటిలో కొన్ని దుంగలను రాత్రికి రాత్రే రాష్ట్ర సరిహద్దు దాటించినట్లు తెలిపారు. ఇంత జరిగినా దేవస్థాన అధికారులు వారంతట వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలేదు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దేవస్థాన ఈఓ నాగేశ్వరావును కొన్ని ప్రశ్నలు వేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈఓ వెంటనే ఫిర్యాదు ఇవ్వలేదు. ఎమ్మెల్యే మరోసారి ఈఓను సంప్రదించిన తర్వాతే ఈఓ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.3 కోట్లు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మూడుశాఖల అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
దొంగలను కాపాడే యత్నం :
ఈ వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసును నీరుగార్చేందుకు టీడీపీ ముఖ్యనేతలు ఇద్దరు రంగంలోకి దిగినట్లు సమాచారం. అందులో భాగంగా ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కింద కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు పలువురు ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు చెట్ల నరికివేతపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిసింది. కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఈవ్యవహారంలో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, లీజుదారులులతో పాటు తమిళ స్మగ్లర్ల పాత్రపై నివేదికను రూపొందిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం ఆ నివేదికలు అనుకూలంగా ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.