
టిమ్ భారం వద్దు బాబోయ్..
నెల్లూరు(బారకాసు): జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్(టిమ్)తో డ్రైవర్‌కు అదనపు విధులు అప్పగిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత చెదిరి ప్రమాదాలు జరుగుతాయనే భయంతో టిమ్ విధులకు డ్రైవర్లు నిరాకరిస్తున్నా అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదు. రెండు విధులు నిర్వర్తించాల్సిందేనని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
ఎదిరించిన వారికి కొద్ది రోజుల పాటు విధుల కేటాయించకుండా వేధిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్టీసీ నెల్లూరు రీజియన్ పరిధిలో రోజూ సుమారు 150 టిమ్ సర్సీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఆత్మకూరు డిపోలో 15 బస్సులు, కావలిలో 15, నెల్లూరు-1లో 45, నెల్లూరు-2లో 32, ఉదయగిరిలో 18, రాపూరులో 9, గూడూరులో 5, వెంకటగిరిలో 15, వాకాడులో 2, సూళ్లూరుపేట డిపోలో 6 బస్సులు టిమ్ విధానంలో కండక్టర్ లేకుండా డ్రైవర్‌తోనే నడుస్తున్నాయి. ప్రధానంగా ఈ విధానంలో దూర ప్రాంత సర్వీసులను నడుపుతున్నారు.
ఒత్తిడితో ప్రమాదాలు :ఓ వైపు టికెట్లు జారీ చేస్తూ, మరోవైపు డ్రైవింగ్ చేసేందుకు డ్రైవర్లు జంకుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, రాత్రివేళలో తీవ్ర ఒత్తిడికి గురై ప్రమాదాలబారిన పడుతున్నారు.
కండక్టర్లలోనూ ఆందోళన : టిమ్ విధానంతో తమ ఉద్యోగాలకు ఆర్టీసీ యాజమాన్యం ఎసరు తెస్తోందని కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్, కండక్టర్ విధులను వేర్వేరుగా అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ను ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోలేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.