జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. పట్టణంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్‌లో సోమవారం సీపీఎం జిల్లా విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించడానికి చర్చ జరగాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు వారి అభిప్రాయాలు చెప్పకుండా అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
2014 ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతోందని ఆరోపించారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. రానున్న ఎన్నికలకు సీపీఎం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యకర్తల్లో మనోధైర్యం పెంచేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సాయిబాబు, లంకా రాఘవులు, పార్టీ జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.