ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నగరశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ధర్నాకు సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, కార్యదర్శి బీ వెంకట్రావు మాట్లాడుతూ నెలరోజుల నుంచి ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వేచేసి ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కానీ, చిన్నచిన్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా అధికారులు చొరవ చూపడం లేదని విమర్శించారు. రోజువారీ జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో అనేక శాఖలున్నాయన్నారు.
ప్రభుత్వ జీఓ ప్రకారం కనీస వేతనాలు అమలుకావడం లేదన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడువేల మందికిపైగా ఉన్న ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అవసరమైన ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. పెరిగిన ధరలకనుగుణంగా 12,500 రూపాయల కనీస వేతనం చెల్లించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. ఇంటిపనివారు, ఆటో, ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జాయింట్ మీటింగ్‌కు హామీ...
ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం అంగీకరించింది. సీఐటీయూ ధర్నా వద్దకు వచ్చిన కలెక్టరేట్ పరిపాలనాధికారి జ్వాలానరసింహం, కార్మికశాఖ ఉపకమిషనర్ అఖిల్‌లు జనవరి 7, 8 తేదీల్లో ఏదోకరోజు జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో సీఐటీయూ నగర నాయకులు జీ బాలకృష్ణ, ఎస్.కోటేశ్వరరావు, కే శ్రీనివాసరావు, పాపని సుబ్బారావు, రాపూరి శ్రీనివాసరావు, ఎస్‌డీ హుస్సేన్, తంబి శ్రీనివాసులు, కేవీ శేషారావు, ఉంగరాల శ్రీను, సీహెచ్ రమాదేవి, ఎం.పద్మ, వీ పద్మ, డీ వెంకట్రావు, ఎన్.ఆదినారాయణ, ఆర్.ఉదయ్, ఐ.శ్రీనురెడ్డి, కే ఇందిర, ఈ గిరి, కే అంజిరెడ్డి, ఆర్.జయరావు, కే బాలచంద్రం, జే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
Published Sat, Dec 21 2013 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement