dama srinivasulu
-
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
► పెద్ద నోట్ల రద్దుతో అంతా నష్టం ►సీపీఐ ఆధ్వర్యంలో ఎస్బీఐ వద్ద ధర్నా ఒంగోలు టౌన్ :పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంకు మెరుున్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి బ్యాంకు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా బడుగు జీవులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ డబ్బులు మార్చుకునేందుకు అనేకమంది రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. చిన్న వ్యాపారాలు, వీధి అమ్మకందారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. ఏటీఎంల వద్ద నో క్యాష్ అనే బోర్డులు ఉండటంతో ప్రజలు ఎక్కడ ఉంటాయా అని చక్కర్లు కొడుతూనే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన పెడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అభ్యుదయ వేదిక గౌరవాధ్యక్షుడు షంషీర్ అహ్మద్, సీపీఐ జిల్లా నాయకుడు ఎస్డీ సర్దార్, నగర నాయకులు కే వెంకటేశ్వర్లు, ఎస్కే మస్తాన్, కే నాగేశ్వరరావు, కే లక్ష్మయ్య, కే అజయ్, పీవీ కృష్ణ, సీహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సిండికేట్ బ్యాంకు వద్ద నిరసన... పెద్దనోట్లను రద్దు చేసి తగినంత చిన్న నోట్లను అందుబాటులో ఉంచకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక భాగ్యనగర్‌లోని ఎల్డీఎం కార్యాలయం, సిండికేట్ బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నగర నాయకుడు దామా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలు మూతపడుతూనే ఉన్నాయన్నారు. తక్కువ మొత్తంలో నగదు జమచేస్తుండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయన్నారు. కొత్త నోట్లు వచ్చేంత వరకు పాత నోట్లు చలామణిలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఏటీఎంలలో ప్రజలకు సరిపడా నోట్లు ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర నాయకులు కే బాలచంద్రం, ఎం.సుబ్బారావు, కేఎఫ్ బాబు, ఏ శ్రీనివాసులు, ఏ సీతామహాలక్ష్మి, సీహెచ్ రమాదేవి, శ్యామ్, ఎస్కే హరికృష్ణ, బీ వెంకారెడ్డి, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం ఎల్డీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నగరశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ధర్నాకు సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, కార్యదర్శి బీ వెంకట్రావు మాట్లాడుతూ నెలరోజుల నుంచి ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వేచేసి ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కానీ, చిన్నచిన్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా అధికారులు చొరవ చూపడం లేదని విమర్శించారు. రోజువారీ జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో అనేక శాఖలున్నాయన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం కనీస వేతనాలు అమలుకావడం లేదన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడువేల మందికిపైగా ఉన్న ఈఎస్ఐ లబ్ధిదారులకు అవసరమైన ఈఎస్ఐ హాస్పిటల్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. పెరిగిన ధరలకనుగుణంగా 12,500 రూపాయల కనీస వేతనం చెల్లించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. ఇంటిపనివారు, ఆటో, ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాయింట్ మీటింగ్‌కు హామీ... ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం అంగీకరించింది. సీఐటీయూ ధర్నా వద్దకు వచ్చిన కలెక్టరేట్ పరిపాలనాధికారి జ్వాలానరసింహం, కార్మికశాఖ ఉపకమిషనర్ అఖిల్‌లు జనవరి 7, 8 తేదీల్లో ఏదోకరోజు జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో సీఐటీయూ నగర నాయకులు జీ బాలకృష్ణ, ఎస్.కోటేశ్వరరావు, కే శ్రీనివాసరావు, పాపని సుబ్బారావు, రాపూరి శ్రీనివాసరావు, ఎస్డీ హుస్సేన్, తంబి శ్రీనివాసులు, కేవీ శేషారావు, ఉంగరాల శ్రీను, సీహెచ్ రమాదేవి, ఎం.పద్మ, వీ పద్మ, డీ వెంకట్రావు, ఎన్.ఆదినారాయణ, ఆర్.ఉదయ్, ఐ.శ్రీనురెడ్డి, కే ఇందిర, ఈ గిరి, కే అంజిరెడ్డి, ఆర్.జయరావు, కే బాలచంద్రం, జే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.