నేడు పాలిసెట్
- తొలిసారిగా ఓఎమ్మార్ షీట్ల వినియోగం
- జిల్లా పరిధిలో విద్యార్థులు 20,334 మంది
- నిమిషం ఆలస్యమైనాఅనుమతించరు
విశాఖపట్నం , న్యూస్‌లైన్ : డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించనున్న పాలిసెట్-2014 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలో 20,334 మంది దీనికి హాజరవుతున్నారు. విశాఖలో 13,740 మంది, జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, భీమిలి కేంద్రాల్లో 6,594 మంది పరీక్ష రాయనున్నారు. తొలిసారిగా ఈ పరీక్షకు ఓఎమ్మార్ షీట్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హాల్ టికెట్‌లు అందజేశారు.
హాల్ టికెట్లు అందని వారికి విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం, పాడేరుల్లోని పాలిటెక్నిక్ కళాశాలల కార్యాలయాల్లో డూప్లికేట్ హాల్ టికెట్లు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. వెబ్‌సైట్‌లో నేరుగా హాల్ టికెట్‌లు పొందడానికి అభ్యర్థులకు నిర్వాహకులు అవకాశం కల్పించారు.
బుధవారం ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. బుక్‌లెట్‌లో పొందుపరిచిన నియమ, నిబంధనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలని పాలిసెట్ కో-ఆర్డినేటర్ కె.సంధ్యారాణి తెలిపారు. సెల్‌ఫోన్, కాలిక్యూలేటర్‌ను కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు.