12,500 ఆలయాల్లో ‘మనగుడి’
► టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
► తెలుగు రాష్ట్రాల్లో 14న ప్రారంభం
తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమాన్ని ఈనెల 14వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12,500 ఆలయాల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఆలయాలకు పంపిణీ చేయాల్సిన పసుపు, కుంకుమ, అక్షింతలు ప్యాకింగ్ కార్యక్రమాన్ని తిరుపతి శ్వేత భవనంలో బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో మాట్లాడుతూ మనగుడి కార్యక్రమాన్ని హిందూ ధర్మప్రచార పరిషత్, దేవాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తామన్నారు. అందుకోసం 11వ తేదీన అన్ని ఆలయాల్లో కైశిక ద్వాదశి నిర్వహించనున్నట్లు తెలిపారు. మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించే ఆలయాలకు అక్షింతలు, పసుపు కుంకుమ, కంకణాలతో పాటు రూ.5 వేల నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని భజన బృందాలు, దాతలు, అర్చకులు, శ్రీవారి సేవకులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
జేఈవో పోల భాస్కర్ మాట్లాడుతూ మనగుడి కార్యక్రమం ద్వారా దేవాలయాల శోభను పెంచే రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, ఇతర వెనుకబడి ప్రాంతాల్లో చైతన్యం తీసుకు రావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా భక్తి పుస్తకాలు భక్తులకు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ప్రాజెక్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వర్ రావు, టీటీడీ ఎపిక్ స్టడీస్ స్పెషల్ ఆఫీసర్ దామోదరం నాయుడు, టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.