అమలాపురం టౌన్ : తుని విధ్వంసకర ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించేపనిలో భాగంగా సీబీ సీఐడీ అధికారులు అమలాపురంలో గత రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. నాటి తుని ఘటనలో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలల్లో ఉన్న అమలాపురం, కొత్తపేట, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన 43 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తునిలోని సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా కూడా ఆ రోజు అల్లర్లలో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ సీబీ సీఐడీ డీఎస్పీ, ఇద్దరు సీఐలు అమలాపురంలో పట్టణ పోలీసు స్టేషన్‌లో గుర్తించిన 43 మందిని విచారిస్తున్నారు.
ఆ 43 మందిలో అమలాపురానికి చెందిన కొందరు రౌడీషీటర్లు కూడా ఉండటంతో వారిని సీఐడీ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరికొందరు రౌడీషీటర్లను కూడా స్టేషన్‌కు రప్పించి ఆ రోజు అల్లర్లలో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు తుని సభకు ఎలా వెళ్లారు... ఎవరి వాహనంపై వెళ్లారు..? వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. తుని విధ్వంసకర ఘటన సమయంలో వీడియోల్లో లభ్యమైన దృశ్యాలను సీఐడీ నిశితంగా పరిశీలించినప్పుడు ముగ్గురు కాపు నేతల పేర్లతో ఉన్న జెండాలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ ముగ్గురు నేతలను కూడా అధికారులు పిలిచి విచారించారు.
ఇప్పటికే అంబాజీపేటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు పోలీసు జీపులు తగలబెడుతున్నప్పుడు ఆ యువకుడి ఉనికి ఎక్కువ కనిపించడంతో అతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నా వారి నుంచి స్పష్టమైన...ఆధారాలతో కూడిన సమాచారం రాకపోవటంతో రౌడీ షీటర్లందరినీ పిలిపించుకుని ఏదో కోణంలో ఏదో సమాచారం వస్తుందన్న దిశగా విచారణ చేస్తున్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల కాన్ఫిరెన్స్ హాలులో డివిజన్‌లోని వీఆర్వోలకు తుని ఘటన వీడియోలు, ఫొటోలు చూపించినా వారు ఓ ఒక్క నిందితుడినీ గుర్తించకపోవడంతో సీబీ సీఐడీ అధికారులు అమలాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ తరహా దర్యాప్తు, విచారణలు చేస్తున్నారని తెలిసింది.
‘తుని’ ఘటనపై సీబీసీఐడీ విచారణ
Published Wed, Mar 2 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement
Advertisement