
అక్రమాలకు పచ్చజెండా..!
- ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ చెక్‌పోస్టు
- ఎలాంటి బిల్లులు లేకపోయినా సున్నం ఉత్పత్తుల రవాణ
- చోద్యం చూస్తున్న మైనింగ్ విజిలెన్స్ అధికారులు
పిడుగురాళ్ల: సున్నం ఉత్పత్తులకు పిడుగురాళ్ల ప్రసిద్ధి చెందిన పట్టణం. ఇక్కడ తయారయ్యే సున్నం మన రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం రవాణా అవుతోంది. సున్నం ఉత్పత్తులైన కాల్చిన సున్నం, సెమ్‌పౌడర్, లైమ్‌పౌడర్, చిప్స్, ముగ్గుకు పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది.
* ఈ రకాలను పేపరు, షుగర్, ఐరన్ ఓర్ తదితర పరిశ్రమల్లో వాడుతుంటారు.
* పస్తుతంరోజుకు 120 నుంచి 150 లారీల సరకు ఇక్కడి నుంచి రవాణా అవుతోంది.
* కాల్చిన సున్నం, సెమ్‌పౌడర్ రవాణాకు మైనింగ్, వే బిల్లులు తప్పనిసరి.
* మైనింగ్ బిల్లుకు రూ.1200, వే బిల్లుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ట్యాక్స్ చెల్లించాలి.
* చిప్స్, ముగ్గు, లై మ్‌పౌడర్ తదితర ఉత్పత్తులకు 10 టన్నులకు రూ.400 మైనింగ్ బిల్లు చెల్లించాలి.
బిల్లులు లేకుండానే రవాణా
* నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే మైనింగ్ శాఖ నుంచి మైనింగ్ బిల్లులు, వాణిజ్య పన్నుల శాఖ నుంచి వే బిల్లులు మంజూరు చేస్తుంటారు.
* ఈ వ్యాపారంలో ఎటువంటి అనుమతులు, లెసైన్స్‌లు లేకుండా వ్యాపారం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు.
* స్థానికంగా బిల్లులు కలిగిన వ్యాపారులను ఆశ్రయించి తమ వాహనాలను గమ్యస్థానాలకు చే ర్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ ఆదాయాన్ని నష్ట పరుస్తున్నారు.
* వ్యాపారం చేయని లెసైన్స్‌దారుల నుంచి కొందరు మైనింగ్, వే బిల్లులు తీసుకుని అసలు లెసైన్స్‌లు లేని వ్యాపారుల సున్నం లారీలను వారే స్వయంగా రవాణా చేస్తుంటారు.
* మైనింగ్ బిల్లుకు రూ.1200 ఖర్చవుతుండగా, బిల్లులు కలిగిన వ్యాపారులు సున్నం వ్యాపారుల నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తూ ఎలాంటి బిల్లులు అవసరం లేదని, అంతా తామే చూస్తామని చెప్పి అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారంలో చెక్‌పోస్టు అధికారుల పాత్ర కీలకంగా వుండడంతో బిల్లులు లేని లారీలు యథేచ్ఛగా తరలిపోతున్నాయి.
* మైనింగ్ చెక్‌పోస్టు అధికారులతో టన్నుకు ఇంతని లెక్క కుదుర్చుకుని ఎటువంటి బిల్లులు లేకుండా సున్నం ఉత్పత్తులను రవాణా చేస్తున్నారు.
చెక్‌పోస్టులు లేకపోవటంతో అక్రమాలు
* గతంలో పొందుగల, చిలకలూరిపేట, విజయవాడ మార్గాలలో మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఉండేవి. కొన్నేళ్ల కిందట ప్రభుత్వం చెక్‌పోస్టులను ఎత్తివేసి మొబైల్ టీములను ఏర్పాటు చేసింది. ఇది అక్రమ బిల్లుల వ్యాపారులకు కలిసొచ్చింది.
* మొబైల్ టీముల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.
* పిడుగురాళ్ల నుంచి రవాణా అవుతున్న సున్నం ఉత్పత్తుల వాహనాలలో 80 శాతం వరకు మైనింగ్, వే బిల్లులు లేకుండా కేవలం క్యాష్‌పైనే నడుస్తున్నట్టు స్వయంగా వ్యాపారులే చెబుతున్నారు.
* ఇలా అక్రమ రవాణా వల్ల మైనింగ్, వే బిల్లుల రూ పంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది.
వివరణ
* సున్నం అక్రమ రవాణాపై దాచేపల్లి మైనింగ్ ఏడీ జి. రామచంద్రరావును వివరణ కోరగా విచారణ చేస్తానన్నారు.
* అక్రమ రవాణా వ్యవహారాలను మైనింగ్ విజిలెన్స్ ఏడీ పర్యవేక్షించాల్సి ఉన్నందున ఆయనను సంప్రదించాలని సూచించారు.
* మైనింగ్ ఏడీ రామచంద్రయ్యను వివరణ కోరగా అక్రమ రవాణా వ్యవహారాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానన్నారు.