మాసూళ్లయినా..మోపెడు కష్టాలే | VIP Reporter Subba Rao RTO Ramchandrapuram | Sakshi
Sakshi News home page

మాసూళ్లయినా..మోపెడు కష్టాలే

Published Sun, Nov 30 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

మాసూళ్లయినా..మోపెడు కష్టాలే

మాసూళ్లయినా..మోపెడు కష్టాలే

పంటను అమ్ముదామంటే.. మద్దతు, గిట్టుబాటు ధరల మాటటుంచి కొనే దిక్కే లేదు. సర్కారీ కొనుగోలు కేంద్రాలున్నా ఉపయోగం శూన్యం. ఖరీఫ్ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ అన్నదాతల అవస్థలను ‘వీఐపీ రిపోర్టర్’  ద్వారా వెలుగులోకి తేవాలన్న ‘సాక్షి’ ఆలోచనను రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు ఆమోదించారు. శనివారం కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన చేసిన ‘వీఐపీ రిపోర్టింగ్’ విశేషాలివి..
 
 రైతుల మేలు, మేలుకొలుపులకు కృషి చేస్తా...రైతులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల  క్షేత్రస్థాయిలో మద్దతు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో సాధకబాధకాల వంటి సమస్యలు తెలుసుకున్నాను. వారికి వ్యవసాయశాఖాధికారులు సరైన అవగాహన కల్పించడం లేదని తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, చేస్తున్న సూచనలు ైరె తుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. పొలంబడిలో రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి పథకాన్నీ రైతులుసద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులువినియోగించుకుని మంచి ధర పొందేలా అన్ని స్థాయిల్లో అధికారులకు స్వయంగా తెలియచేస్తాను
 రిపోర్టర్ కె. సుబ్బారావు,ఆర్టీఓ,రామచంద్రపురం
 
 ఆర్డీఓ కె.సుబ్బారావు : బాబూ నీ పేరేంటయ్యా...?
 రైతు : పర్వతిని సత్యన్నారాయణండీ....
 ఆర్డీఓ : ఏంటీ వ్యవసాయం ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు
 చేస్తున్నావు? తొలకరికి ఎంత పండించావు?
 రైతు : ఏటా బాడి పిసుక్కుని పంట పండిస్తున్నా
 తగిన డబ్బులు రావటంలేదు.  ఈసారి 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను.
 ఆర్డీఓ : 75 కేజీల బస్తా రేటు ఎంత ఉంది?
 రైతు : నెమ్ము 18 శాతం దాకా వస్తంటే మిల్లోళ్లు 15 శాతం ఉంటే గానీ కొనమంటున్నారు. ఇప్పటి దాకా  ఊళ్లో గింజ కూడా కొనలేదండీ.
 ఆర్డీఓ : కూలీ డబ్బులు ఎలా ఇస్తున్నారు?  
 రైతు: కుప్ప నూరుత్తున్నానాండీ.. సందేలకి కూలీలకి రూ.15 వేలు దాకా ఇయ్యాల. అక్కడో పదేలు, ఇక్కడో పదేలు తెత్తాను. ఆనక దాన్యం అమ్మాక సావుకారికి తీర్చాలంతే...
 ఆర్డీఓ : నీపేరేంటయ్యా?  
 రైతు : తాడాల ఏడుకొండలండి. మూడెకరాలు ఏసి, పుత్తు పూస తాకట్టెట్టి పెట్టుబడి ఎట్టానండి.  ఆ డబ్బులొత్తాయో లేదో తెలత్తాలేదండీ...?
 ఆర్డీఓ : తాతా నీ పేరేంటి? కూలి రేట్లు ఎలా ఉన్నాయి?
 రైతు : కొరమాటి సుబ్బారావండీ. వుప్పుడు సీజన్ కదాండీ మగాళ్లకు రూ.600 నుంచి రూ.700వరకు ఉంది బాబూ.
 ఆర్డీఓ : నీ పేరేంటి బాబూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి తెలుసా?  
 రైతు : దంగేటి సుర్యనారాయణండీ. మాకు పెబుత్వం పెట్టిన వాటి కాడికి దాన్యాన్ని పట్టికెళ్లటం చేనా కట్టం బాబూ.
 ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? ప్రభుత్వ సహకారం అందుతోందా?
 రైతు : అల్లూరి వీరవెంకట సత్యన్నారాయణండీ. ఏం పెబుత్వమండీ బాబూ.. సీజన్ అయిపోయినాక అప్పులు ఇత్తే ఏటి లాభం?   
 ఆర్డీఓ : నీ పేరేంటి పెద్దయ్యా? నీవెంత చేను పండిస్తున్నావు? కీ ఇబ్బందులేంటి?
 రైతు : బోడపాటి అర్జునరావయ్యా. గింజలకు సరైన ధర అందటంలేదు.
 ఆర్డీఓ : కొనుగోలు కేంద్రాలున్నాయిగా?
 రైతు : ఆళ్లేమో 15 నెమ్ముండాలంటారు బాబూ. ఇయ్యేమో 18 నెమ్ముంటున్నాయి.  
 ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? వెదజల్లే విధానం పాటిస్తున్నారా?
 రైతు : పర్వతిని సత్యన్నారాయణ సార్! 20 ఏళ్ల క్రితమే ఎదజల్లేనండీ. ఎద సాగు బానే ఉంటంది. ఈ ప్రాంతంలో రైతులు ఈ పద్దతే ఎక్కువగా రెండో పంటలో వేత్తున్నారు.
 ఆర్డీఓ : శ్రీవరి సాగు మీకు తెలుసా? వ్యవసాయాధికారులు ఏమైనా సూచనలిస్తున్నారా?
 రైతు : శ్రీవరి సాగు బానే ఉంటుంది గాని సారూ.. పెట్టుబడి ఎక్కువ. వ్యవసాయాధికారులు  మా దగ్గరకు రారు సారూ!
 ఆర్డీఓ : నీ పేరేంటి? మీకు రుణాలు ఏమైనా ఇస్తున్నారా? పెట్టుబడులు ఎలా పెడుతున్నారు?
 రైతు : సత్యసాయి వెంకటరమణండీ. డిగ్రీ చదివి వ్యవసాయం చేస్తున్నా..అంత లాభసాటిగా లేదండి.
 ఆర్డీఓ : చదువుకున్నావు కదా.. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తున్నావా?
 రైతు : వ్యవసాయాధికారులు ఎప్పుడు మీటింగులు పెడుతున్నారో తెలియటం లేదు.  
 ఆర్డీఓ : సేంద్రియ పద్ధతుల్ని ఎందుకు ఎంచుకోవటంలేదు? పొలంబడికి వెళుతున్నారా?
 రైతు: ఈ ప్రాంత రైతులకు దీనిపై ఇంకా అవగాహన లేదు. పొలంబడి ఎక్కడో ఒక చోట పెట్టి, అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప ఉపయోగంలేదు.
 ఆర్డీఓ : మీపేరేంటండీ? మీరెంత వ్యవసాయం చేస్తున్నారు? మీ ఇబ్బందులేంటి?
 రైతు : జానకిరామయ్యండీ. మూడెకరాలు చేస్తున్నాను. 80 బస్తాల వరకు పండినా కూలీలకే రూ.54 వేలు ఖర్చయ్యింది.  
 ఆర్డీఓ : ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఎందుకు వినియోగించుకోవటం లేదు?
 రైతు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు మాకు ఖర్చవుతుంది. అదే మిల్లర్లయితే ఆ ఖర్చు వారే  భరించి తీసుకెళతారండీ.
 ఆర్డీఓ : నీ పేరేమిటయ్యా? మద్దతు ధర లభిస్తోందా? రూ.1020, రూ.1060 వస్తున్నాయా?
 రైతు : నరసింహ మూర్తి అండీ. పెట్టుబడులు వస్తే చాలు.. గిట్టుబాటు ఎక్కడ వస్తుంది సారూ. అమ్ముదామంటే కొనేవాడే కనిపించడం లేదండీ. రూ.980, రూ.990 అంటున్నారు. అదీ 17 శాతం నెమ్ములున్నాయంటే ప్రతి ఒక్కశాతానికి కేజీ  కటింగ్ పెడుతున్నారండీ.
 ఆర్డీఓ : నేనూ రైతు బిడ్డనే. మీ ఇబ్బందులన్నీ అర్థమయ్యాయి. అధికారులకు చెప్పి కొనుగోలు కేంద్రాలపై మీకు తెలియచేసే ఏర్పాటుచేస్తా. వ్యవసాయాధికారులు  మీ దగ్గరకు వచ్చేలా ఆదేశాలు జారీచేస్తాను. సరే వెళ్లి రమ్మంటారా.
 రైతులు : మంచిది సారూ..
 
  ప్రజెంటర్స్:
 - లక్కింశెట్టి శ్రీనివాసరావు,
 చెల్లుబోయిన శ్రీనివాస్
 ఫోటోలు : గరగ ప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement