కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ :
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమస్థానంలో నిలుపుదామని ఏజేసీ రామస్వామి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కర్నూలు నగర శివార్లలోని లక్ష్మీపురం జగన్నాథగుట్టపై ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి కన్వీనర్ బి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏజేసీతో పాటు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రశేఖర కల్కూర, ఉస్మానియా కాలేజీ హిస్టరీ అధ్యాపకుడు అతావుల్లాఖాన్, రిటైర్డు హిస్టరీ అధ్యాపకుడు కె.మద్దయ్య, టౌన్ మాడల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.చెన్నయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమ ఆరంభంలో కె.మద్దయ్య రచించిన ‘కేవ్ టెంపుల్స్ ఆఫ్ జగన్నాథగుట్ట’ పుస్తకాన్ని ఏజేసీ రామస్వామి ఆవిష్కరించి మాట్లాడారు.
తిరుపతి పుణ్యక్షేత్రం కారణంగా చిత్తూరు జిల్లా టూరిజంలో ప్రథమస్థానంలో ఉండగా, కర్నూలు రెండోస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలోని శ్రీశైలం, మంత్రాలయం, అహోబిళం, యాగంటి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు జిల్లా నలుమూలలా ఏ ప్రాంతానికి వెళ్లినా ఏదోఒక చరిత్ర ఉండటం మన అదృష్టమని, అందుకే విదేశీయులు సైతం సందర్శిస్తున్నారని తెలిపారు. ఒక దివ్యక్షేత్రంలో కలుసుకోవడం మంచి అనుభూతినిస్తోందని చంద్రశేఖర కల్కూర పేర్కొన్నారు. మన గ్రామంలో, మనదేశంలో పూర్వీకులు ఏమేం చేశారనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఇసుక శాతం తగ్గి నదులు నిర్జీవమవుతున్నాయని, ఇసుక దొరక్క మున్ముందు ఇలాంటి కట్టడాలు నిర్మించుకోలేమేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్నాథగుట్టలోని ఆలయాలు బాదామీ చాళుక్యుల కాలంలో వెలసిన స్వయంభూ లింగాలని, జగన్నాథునితో పాటు శివుడు, లక్ష్మి ఆలయాలు కూడా పక్కపక్కనే ఉన్నాయన్నారు.
జగన్నాథగుట్టను విష్ణుపాద తీర్థమని పిలుస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరగకుండా పోలీసుశాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందమైన జైన దేవాలయాలు, మసీదులు, దేవాలయాలు చారిత్రాత్మక చిహ్నాలుగా ఉన్నాయని కె.చెన్నయ్య అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కొలనులు, బావులు, ధ్వజస్తంభాలు జిల్లా అంతటా కనిపిస్తాయని, ఇవి అద్భుతమైన శిల్పకళకు నిదర్శనాలని తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులు, విద్యార్థినులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి సైతం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డు అటవీ అధికారి మోహన్‌సింగ్, ఇండస్‌స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి, రిటైర్డు ఫారెస్టు ఉద్యోగులు మాబుసాబ్, కె.హరినాథ్, ఎల్లస్వామి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకంలో ప్రథమస్థానం సాధిద్దాం
Published Sat, Sep 28 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement