ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ఎవరికి లాభం అంటే.. కచ్చితంగా ఉత్పత్తిదారులకే. దీనివల్ల వినియోగదారులకు సమకూరే ప్రయోజనం స్వల్పమే. దీనికితోడు రవాణా చార్జీలు పెరిగాయి. డీజిల్ ధరలు తగ్గనంటున్నాయి. దీనివల్ల బడ్జెట్ ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు తగ్గినా ట్రాన్స్‌పోర్టు చార్జీలు కలిపితే మరింత ప్రియమయ్యే ప్రమాదం నెలకొంది. కొత్త బడ్జెట్ విధానాన్ని స్పష్టం చేయాలంటే మరికొంత కాలం ఆగాలని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి.
‘చల్లదనం’ ఇక వేడెక్కుతుంది
కూల్‌డ్రింక్‌లంటే పిల్లల నుంచి పెద్దలదాకా ఇష్టపడాల్సిందే. ఎండాకాలంలో అయితే వాటికి యమ డిమాండ్ ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్ ప్రకారం వాటి ధరలు పెరగనుండటంతో శీతల పానీయాల ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సరాసరిన రూ.10 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఎండాకాలంలో అయితే సుమారు 15 లక్షల వరకు, మిగిలిన సమయంలో రూ. 7 నుంచి రూ. 8 లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూల్‌డ్రింక్స్‌పై ఎక్సైజ్ సుంకం 5 శాతం పెరగనుంది.
200 ఎంఎల్ బాటిల్ ధర 10కు విక్రయించాల్సి ఉన్నా.. మార్కెట్‌లో రూ. 13వరకు విక్రయిస్తున్నారు. ఇక ఎక్సైజ్ ట్యాక్స్ పెరిగితే ఈ బాటిల్‌కు మరో రూపాయి పెరుగుతుంది. అంటే వ్యాపారులు కచ్చితంగా రూ. 15కు విక్రయిస్తారు. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే రోజుకు లక్ష రూపాయల దాకా వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇదే జరిగితే వ్యాపారం తగ్గుముఖం పడుతుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొందరికే పాద‘రక్షలు’
నూతన బడ్జెట్‌లో పాద రక్షల ధరలు దిగివచ్చేలా చర్యలు తీసుకున్నా.. అది కొంతమందికే ఉపయోగపడనుంది. వీటిపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అయితే ఇక్కడే మెలిక ఉంది. రూ. 500 నుంచి వెయ్యి రూపాయల్లోపు ఉండే పాదరక్షలకే ఈ సుంకం తగ్గింపు వర్తిస్తుంది. జిల్లాలో పరిశీలిస్తే దాదాపు 60 శాతం మార్కెట్ రూ. 500 లోపు కొనుగోలు చేసేవారిదే.
ఇక మిగిలిన 40 శాతం మందిలో కూడా దాదాపు 30 శాతం మంది మాత్ర మే బ్రాండెడ్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రముఖ కంపెనీల ఉత్పత్తులన్నీ వెయ్యి రూపాయల పైగానే ఉంటాయి. అంటే సెమీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనేవారే తాజా సవరణల వల్ల లబ్ధిపొందుతారన్నమాట. ఇలాంటివారు జిల్లాలో పదిశాతం మందే ఉన్నట్లు అంచనా. దీనివల్ల పేద , మధ్య తరగతివారికి ఒరిగిందేమీలేదు.
‘పోర్టబుల్’ మేజిక్ పని చేసేనా?
పోర్టబుల్ టీవీల సైజు 14 అంగుళాలుంటుంది. అయితే పోర్టబుల్ టీవీల కొనుగోళ్లు జిల్లాలో పదిశాతానికి మించి లేదు. మధ్యతరగతివారు ఎక్కువగా ఫ్లాట్ టీవీలు కొనుగోలు చేస్తుంటారు. ఇవి, 20 లేదా 21 అంగుళాల నుంచి అందుబాటులో ఉంటాయి. ఎల్‌సీడీలు అయితే 23 అంగుళాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి.. 19 అంగుళాల్లోపు ఉండే కలర్ టీవీలకు మాత్రమే 10 శాతం కస్టమ్స్ సుంకం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇంత తక్కువ సైజు టీవీల కొనుగోలుకు మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉండరు. దీనివల్ల తక్కువమంది మాత్రమే ప్రయోజనం పొందగలరు. అదే సమయంలో సుంకం నుంచి మినహాయింపు వచ్చింది కాబట్టి 19 అంగుళాల సైజులో ఉండే టీవీలు త్వరలో మార్కెట్‌లోకి భారీగా వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల ఒక్కో టీవీకి 500 రూపాయల దాకా తగ్గుతుంది. అయితే తక్కువ సైజులో ఉంటే టీవీలను ఎంతమంది ఇష్టపడతారో చూడాలి. కలర్ పిక్చర్ ట్యూబులపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చినందువల్ల కలర్ టీవీ ధర కూడా 200 రూపాయల దాకా తగ్గే అవకాశాలున్నాయి.
పొగ ఊదితే జేబుకూ చిల్లు..
జిల్లాలో పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారికి కొదువే లేదు. మొత్తం మీద 33.97 లక్షల మంది జనాభా ఉండగా వారిలో ఏకంగా 5 నుంచి 6 లక్షల మంది దాకా ధూమపానం లేదా పాన్ మసాలా ఉత్పత్తులు తీసుకుంటారు. వీరి ద్వారా రోజుకు 3 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే బడ్జెట్ ప్రకారం పొగాకు ఉత్పత్తుల ధరలు 25 శాతం మేర పెరగనున్నాయి. అంటే జిల్లాలో రోజుకు వ్యాపారం 4 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అయితే ఈ ధరల దెబ్బకు కొంతమేర వినియోగదారుల సంఖ్య తగ్గినా.. అది తాత్కాలికమే అని భావిస్తున్నారు.
బడ్జెట్ఎవరికి లాభం ?
Published Sun, Jul 13 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement