=మూడేళ్లుగా కరువున్నా ఏం చేస్తున్నారు
=చిగురు గోరు చిక్కుడు సాగుపై దృష్టి పెట్టండి
=ఫౌల్ట్రీపై దృష్టి సారించండి
=ప్రయోగాలన్నీ మదనపల్లె డివిజన్‌లోనే చేపట్టాలి
=తూతూమంత్రంగా పనిచేయడం మానుకోండి
=ఆత్మ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ కె.రాంగోపాల్
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మూడేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తున్నా రైతులకు భరోసా ఇచ్చే పంటలపై దృష్టి పెట్టకుండా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాంగోపాల్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోతున్నారని తెలి సినా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించకుండా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. అజెండాలో తొలి అంశంగా చిగురు గోరు చిక్కుడు సాగుపై సుదీర్ఘ చర్చ జరిగింది.
తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఈ పంట జిల్లాలో సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందని శాస్త్రవేతలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా రాజస్థాన్‌లో ఎక్కువగా సాగయ్యే ఈ పంటకు సంబంధించి అధ్యయనం చేశామని, దీని విత్తనాలు టన్ను రూ.6200 నుంచి రూ.32 వేల వరకు పలుకుతాయని తెలిపారు. మన జిల్లాలో తక్కువ కాకుండా రూ.17 వేలకు విక్రయించ వచ్చునని, ఎకరాకు కనీసం 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేతలు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం కలిగించే పంటలపై దృష్టి పెట్టాలని అధికారులను హెచ్చరించారు.
తూతూమంత్రంగా పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. చిగురు గోరు చిక్కుడును జిల్లాలో పెద్ద ఎత్తున సాగులోకి తేవడానికి మరోసారి రాజస్థాన్‌కు వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. 2015 రబీ సీజన్ నాటికి జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు ఈ పంటను సాగు చేసుకుని లాభాలు పొందడానికి అధికారులు కృషి చేయాలన్నారు. మామిడి, చెరుకు తదితర వ్యర్థాల ద్వారా ఇటు రైతులకు అటు వాటిని తిన్న పశువులకు నష్టం వాటిళ్లకుండా ఉండేందుకు కంపోస్టు తయారు చేయడానికి కాలుష్య నివారణ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు.
కోళ్ల పరిశ్రమ యూనిట్ ఏర్పాటు
జిల్లాలో కోళ్ల పరిశ్రమకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ద్వారా తొలుత లక్ష కోళ్లతో ఫారం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ శాఖ జేడీని కలెక్టర్ ఆదేశించారు. పాడి ఆవున్న ప్రతి ఇంటిలో 5 నుంచి 10 కోళ్లను పెంచుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలంలోపు కోళ్ల పరిశ్రమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు నాబార్డు ద్వారా నిధులు సమీకరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచైనా టమాట సాగులో యాంత్రికీకరణ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు.
ప్రయోగాలన్నీ మదనపల్లె డివిజన్‌లోనే..
పంట ప్రయోగాలన్నీ ఇకపై మదనపల్లె డివిజన్‌లోనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పంట ప్రయోగాలకు పడమటి మండలాల్లోనే వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఆత్మ పీడీ అనంతరావు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ జేడీలు రవికుమార్, శ్రీనివాసరావు, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, నాబార్డు ఏజీఎం రవిబాబు, రైతులు జయచం ద్ర చౌదరి, బాలక్రిష్ణారెడ్డి, విజయచంద్రనాయు డు పాల్గొన్నారు.
ఎందుకింత నిర్లక్ష్యం?
Published Thu, Dec 12 2013 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement