భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న రూప
కర్నూలు, ఆదోని టౌన్: అనుమానం పేరుతో భర్త ఇంటినుంచి గెంటేశాడు. చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఓ వివాహిత దీక్ష చేపట్టింది. ఈ ఘటన బుధవారం ఆదోని పట్టణం శివశంకర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు రూప, ఆమె తండ్రి రాంభూపాల్, టూ టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు..గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన రూపతో 2011లో ఆదోని పట్టణం శివశంకనర్ నగర్‌కు చెందిన కేశవ్‌కు వివాహమైంది.
పెళ్లయిన నెలరోజుల తరువాత భార్యపై అనుమానం పెంచుకొని కేశవ్ వేధిస్తూ వచ్చాడు. అదనంగా కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి గెంటేశాడని రూప ఆరోపించారు. కోర్టులో కేసు వేయడంతో..2016లో తనకు నెలకు రూ.5వేలు చొప్పున భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఇన్నాళ్లు పుట్టింట్లోనే ఉంటూ తలదాచుకుంటున్నానని, భర్త లేకపోతే తనకు జీవితమే లేదని ఆమె విలపించారు. టూటౌన్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆమె దీక్ష విరమించి స్టేషన్‌కు వచ్చారు. తాను గర్భవతి అయినప్పటికీ బలవంతంగా టాబ్లెట్లు మింగించి భర్త అబార్షన్ చేయించాడని రూప పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ భాస్కర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment