
అర్థం లేని వ్యాఖ్యలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా
హైదరాబాద్ : పదే పదే తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. పరిటాల హత్యను టీడీపీ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారన్నారు. పరిటాల రవి హత్యకేసులో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తనపై ఆరోపణలు చేయటం తగదన్నారు. ఆ కేసులో దోషులకు ఇప్పటికే కోర్టు శిక్షలు విధించిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రవి హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసునని అన్నారు. అసెంబ్లీలో టీడీపీ నేతలు ఈ ఆరోపణలు చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.
ఒకవేళ అదే వాస్తవమైతే జేసీ దివాకర్ రెడ్డి సోదరులకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చేవారా అని ప్రశ్నించారు. మళ్లీ ఇవే ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా ఎందుకు వేయకూడదని సూటిగా ప్రశ్న వేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై, దానికి వంత పాడుతున్న ఓ వర్గం మీడియాపై పరువునష్టం దావా ఎందుకు వేయకూడదన్నారు. మరి వంగవీటి రంగా హత్య కేసుపై సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా తనపై బురద చల్లడమే లక్ష్యామా అని ఆయన ప్రశ్నించారు.