రైల్వేస్టేషన్లలో సమస్యల పరిష్కారానికి కృషి
► నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్లలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9న విజయవాడలో పార్లమెంటు సభ్యులతో రైల్వే జీఎం సమావేశం నిర్వహించనున్న సందర్భంగా నెల్లూరు సౌత్, వేదాయపాళెం రైల్వే స్టేషన్లను ఎంపీ మేకపాటి ఆదివారం పరిశీలించి పలు సమస్యలను గుర్తించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానంగా సౌత్ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంలు, మరుగుదొడ్లు, షెల్టర్స్ సరిగా లేవని తమ దృష్టికి వచ్చిందన్నారు. నెల్లూరు ప్రధాన స్టేషన్‌లో రెండు, మూడు ఫ్లాట్‌ఫాంలు సరిగాలేవని, వాటికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిసిందన్నారు. వాటి విషయంపై కూడా చర్చిస్తామన్నారు. సౌత్‌స్టేషన్‌లో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, అయినప్పటికీ తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ స్టేషన్లతో పాటు బిట్రగుంట, కావలి, ఉలవపాడు స్టేషన్లలో కూడా సమస్యలను గుర్తిస్తున్నామన్నారు. నెల్లూరులో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, తమిళనాడు, గంగాకావేరి తదితర రైళ్లను నిలిపేవిధంగా చూడాలని కొంత కాలంగా అడుగుతున్నామన్నారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లను నెల్లూరు ప్రధాన స్టేషన్‌లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని జీఎం దృష్టికి తీసుకెళతామన్నారు.
వేదాయపాళెం స్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్‌రోడ్డులు నిర్మాణం, పార్కింగ్‌కు షెల్టర్ అవసరమన్నారు. స్టేషన్‌లో ఆటో స్టాండ్‌కు అనుమతి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆటో కార్మికులు ఈ సందర్భంగా ఎంపీని కోరారు. ఎంపీ వెంట నెల్లూరు స్టేషన్ ఎస్‌ఎస్ ఆంథోని జయరాజ్, చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ సాగర్, వైఎస్సార్‌సీపీ నేత కర్తం ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.