వైఎస్ జగన్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు: జైలు అధికారులు
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని జైలు అధికారులు ధృవీకరించారు. ఈ సాయంత్రం వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని జైలు డాక్టర్లు పరిశీలించారు. వైఎస్ జగన్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు అని జైలు అధికారులు తెలిపారు.
‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆలోచింపజేయలేకపోతున్నాయని చాలా బాధగా ఉంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన తీరు పట్ల ఆవేదనగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇంత కీలక సమయంలో వారి ఓట్లు, సీట్ల కోసం మౌనం వహించటం, అవకాశవాద రాజకీయాలు చేస్తుండటం బాధ కలిగిస్తోంది. స్పందించవలసిన ఈ సమయంలో మనం స్పందించకపోతే ఈ రాష్ట్రం ఏడారి అవుతుంది. కాబట్టి రేపటి నుంచి (ఆదివారం) జైలులోనే నేను నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే.