
జేసీ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో!
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ బఫూన్, జోకర్ అని, మతి భ్రమించి చిల్లర నాయకుడిలా, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
చిత్తూరు, తాడిపత్రి, కడప: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ బఫూన్, జోకర్ అని, మతి భ్రమించి చిల్లర నాయకుడిలా, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంపీ స్థాయికి తగ్గట్టుగా, హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. కడప వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబులతో కలిసి స్థానిక శాసనసభ్యులు ఎస్‌బీ అంజద్‌బాషా గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో వేలమంది పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య మాట్లాడటం పెద్ద గొప్పేం కాదని... దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా కడపకుగానీ, పులివెందులకుగానీ వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. చెంచాలు వైఎస్‌ను తిడుతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందాడని ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు. జేసీ దివాకర్‌రెడ్డి సభ్యత, సంస్కారం మరిచి రోడ్డుపై చిల్లర వాళ్లు మాట్లాడే భాష ఉపయోగించారని దుయ్యబట్టారు.
జేసీ.. నోరు అదుపులో పెట్టుకో!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పుకోసం, పదవిపై కాంక్షతోనే దివాకర్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి చిత్తూరులో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురంలో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని... ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడమే తరువాయని చెప్పారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కృష్ణా జలాలు సీమ జిల్లాలకు రావడంలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని.. సీమలోని అన్ని ప్రాజెక్టులనూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడో పూర్తి చేశారని తెలిపారు. గేట్లు ఎత్తి తానే పనులన్నీ చేశానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు.
జేసీకి మతి భ్రమించింది
ఎంపీ జేసీకి మతిభ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి దుయ్యబట్టారు. దివంగత వైఎస్ రాజారెడ్డి, తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే ఆర్హత జేసీకి లేదన్నారు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారు కూడా నేడు స్వేచ్ఛగా తిరగడాన్నిబట్టే వైఎస్ కుటుంబం ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని సూచించారు.
రాయలసీమలో ఫ్యాక్షన్‌కు మూలం జేసీ కుటుంబమేనని మండిపడ్డారు. వారిలా తాము తెలంగాణ గద్వాల్ నుంచి వలస రాలేదని విమర్శించారు. తాను తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా రావడంతో జేసీ సోదరుల నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారన్నారు. పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రేపుతున్నారని తెలిపారు. తన స్వగ్రామం తిమ్మంపల్లిలోనూ ఇల్లుకొని గొడవలకు ఆజ్యం పోయాలని చూస్తున్నారన్నారు. తాడిపత్రిలో ఇన్నాళ్లూ బెదిరింపు రాజకీయాలు చేశారని, ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి హత్యలోనూ వారికి సంబంధం ఉందని తెలిపారు. వారి అరాచక రాజకీయానికి చరమగీతం పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.