మాట్లాడుతున్న ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి
మదనపల్లె: అవినీతి అక్రమాలతోపాటు, కేంద్రం నిధుల దుర్వినియోగంపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శని వారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని సీఎంలలో ఎక్కువ పరిపాలన అనుభవజ్ఞుడిగా చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని, టీడీపీ నాయకులు అవినీతికి పాల్ప డుతున్న వైనాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు వివరిస్తున్నారని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అమిత్‌షా పంపిన నిధుల వివరాల లేఖపై సీఎం ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. కేంద్ర నిధుల వినియోగంపై బీజేపీ, టీడీపీ భిన్న కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో జ్యుడిషియల్ లేదా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా చేస్తున్న పోరాట ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిధులు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ పనులకు రూ.23 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ భాగస్వామ్యంతో సీసీ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇంకా రావాల్సి ఉందని, త్వరలో వీటిని తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సమావేశంలో బీసీ నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, అంబేడ్కర్ చంద్రశేఖర్, పూజారి రమేష్, వెలుగు చంద్ర, కృష్ణగోపాల్ నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment