వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల విరాళం
* ఎంపీలు 2 నెలలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నెల వేతనం విరాళం
* విజయసాయిరెడ్డి విరాళం లక్ష రూపాయలు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తమ రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తుపాను బాధితుల సహాయార్థం వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన నిధికి తొలి విరాళంగా జగన్ రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.
దాంతో పాటు తుపాను బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని ఆయన పిలుపునివ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతలు స్పందించారు. పార్టీ ఎంపీలు తమ రెండు నెలల వేతనాన్ని వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు సంస్థలు ఏర్పాటు చేసిన నిధికి విరాళంగా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నెల రోజుల వేతనాన్ని ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు.
సాక్షి ఉద్యోగుల విరాళం
తుపాను బాధితుల సహాయార్థం ‘సాక్షి’ మీడియా గ్రూపు సంస్థల ఉద్యోగులు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి నిధికి వారు ఆ విరాళాన్ని అందజేస్తారు.