బంజారాస్ పర్సనల్ కేర్
♦ మూడు నెలలకొక ఉత్పాదన
♦ కంపెనీ ఎండీ రమేష్ విశ్వనాథన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంజారాస్ బ్రాండ్‌తో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న విశాల్ పర్సనల్ కేర్ తన శ్రేణిని పెంచుతోంది. సహజ సిద్ధ వనమూలికలతో తయారైన 15 రకాల ఉత్పత్తులను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తోంది. తాజాగా స్కిన్ పాజిటివ్ పేరుతో దానిమ్మతో తయారైన బ్యూటీ క్రీమ్‌ను విడుదల చేసింది. మూడు నెలలకు ఒక కొత్త ఉత్పాదన తీసుకొస్తామని విశాల్ పర్సనల్ కేర్ ఎండీ రమేష్ విశ్వనాథన్ ఈ సందర్భంగా మీడియాకు బుధవారం తెలిపారు. ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక నిపుణులతో కూడిన ఆర్‌అండ్‌డీ బృందం నిమగ్నమైందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.20 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు.
విస్తరణలో కంపెనీ..
హైదరాబాద్‌కు చెందిన విశాల్ పర్సనల్ కేర్ ఇప్పటికే చైనా, సింగపూర్, మలేషియా, ఒమన్, యూఏఈల్లో అడుగు పెట్టింది. ఈ ఏడాది మధ్యప్రాచ్య దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో విస్తరిస్తామని కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.శ్రీనివాస్ తెలిపారు. 2015-16లో కంపెనీ రూ.60 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది రూ.100 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. ఎగుమతుల ద్వారా 10% ఆదాయం ఆశిస్తోంది. అన్ని ప్రొడక్టులకు ఆయుష్, హలాల్, జీఎంపీ ధ్రువీకరణ ఉందని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బెనర్జీ వివరించారు.
ఆయుర్వేద ఉత్పత్తులకే..: వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విపణి దేశంలో రూ.18,000 కోట్లుంది. ఇందులో 18-20 శాతం వృద్ధి రేటుతో ఆయుర్వేద ఉత్పత్తుల వాటా రూ.3,000 కోట్లుందని రమేష్ వెల్లడించారు. నాన్-ఆయుర్వేద విభాగం కేవలం 5-6 శాతమే వృద్ధి నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విస్తరణకుగాను రూ.30 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.