
న్యూఢిల్లీ: నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. మొబైల్స్ తయారీని సుమారు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే 100 కోట్ల యూనిట్ల స్థాయికి చేర్చాలని జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019లో నిర్దేశించుకున్నారు. ఇందులో రూ. 7 లక్షల కోట్ల విలువ చేసే 60 కోట్ల యూనిట్స్ ఉండనున్నాయి. అలాగే, రక్షణ శాఖ, ఇతర వ్యూహాత్మక విభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ అవసరాలను కూడా తీర్చడంపై దృష్టి సారించాలని ఈ విధానంలో నిర్దేశించుకున్నారు. 2012లో తొలిసారిగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం అమల్లోకి వచ్చింది.
మరోవైపు, పోంజీ స్కీముల్లాంటి అనియంత్రిత డిపాజిట్ స్కీములను నిషేధించడం కోసం ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గతేడాది జూలైలో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అటు కంపెనీలు సొంత అవసరాల కోసం తీసుకున్న గనుల (క్యాప్టివ్ మైన్స్) నుంచి ఉత్పత్తి చేసే బొగ్గులో 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే వెసులుబాటును ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.