సాక్షి, న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ తెలిపింది. దేశీయంగా అమ్ముడయ్యే వివిధ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో 95 శాతం దేశీయంగానే తయారైనవే ఉంటున్నా.. 25–70 శాతం విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. కరోనా వైరస్ పరిణామాలతో చైనా నుంచి సరఫరా దెబ్బతినడంతో అప్పట్నుంచే విడిభాగాల దిగుమతి కోసం దేశీ సంస్థలు ఇతర మార్కెట్లను పరిశీలించడం ప్రారంభించాయని తెలిపింది.
చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడానికి ముందునుంచే కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. థాయ్‌లాండ్, వియత్నాం, కొరియా తదితర దేశాలను పరిశీలించాయని వివరించారు. ఎయిర్‌కండీషనర్లకు సంబంధించిన విడిభాగాలను అత్యధికంగా, వాషింగ్ మెషీన్ల విడిభాగాలను అత్యంత తక్కువగా దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు.
దేశీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి..
‘పరికరాల కోసం సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దాకా చైనాపై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇందుకు సమయం పడుతుంది. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి‘ అని కమల్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వీటిని అభివృద్ధి చేసుకునేందుకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం కూడా దశలవారీ తయారీ పథకం (పీఎంపీ) వంటి స్కీములతో తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని కమల్ చెప్పారు. దీనిపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
చైనాయేతర సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ ..
బాయ్‌కాట్ చైనా ఉద్యమంతో చైనాయేతర కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్ కమ్యూనికేషన్స్) అద్వైత్ వైద్య తెలిపారు. ‘గడిచిన కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ధరల శ్రేణిలో కొత్తగా ఆరు హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. అలాగే భారత్‌లో మా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నాం. మా మేకిన్ ఇండియా ఉత్పత్తుల గురించి భారీ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం‘ అని ఆయన వివరించారు. ఇక వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ తాము చైనా నుంచి కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు తెలిపింది.
‘డోక్లాం ఉదంతం జరిగినప్పట్నుంచీ గడిచిన కొన్నాళ్లుగా మేం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం‘ అని సంస్థ ఎండీ చంద్రు కల్రో పేర్కొన్నారు. చైనా నుంచి ఫినిష్డ్ గూడ్స్ కొనుగోళ్లు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, దేశీయంగానే విడిభాగాల వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్ అవసరాల కోసం టీటీకే ప్రెస్టీజ్ దిగుమతి చేసుకునే వాటిల్లో చైనా వాటా సుమారు 10 శాతం ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతులను 5 శాతానికన్నా తక్కువకే పరిమితం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment