కాఫీ కింగ్‌ అదృశ్యం | Coffee King Siddhartha Missing In Netravati River | Sakshi
Sakshi News home page

కాఫీ కింగ్‌ అదృశ్యం

Published Wed, Jul 31 2019 2:55 AM | Last Updated on Wed, Jul 31 2019 5:04 AM

Coffee King Siddhartha Missing In Netravati River - Sakshi

సాక్షి, బెంగళూరు : దేశ కార్పొరేట్‌ ప్రపంచమంతా మంగళ వారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాఫీ కింగ్‌గా పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, వ్యాపారవేత్తగా తాను విఫలమయ్యానని పేర్కొంటూ సిద్ధార్థ సంతకంతో ఒక లేఖ బయటపడింది. అందులో ఆదాయపు పన్ను అధికారులు, పీఈ భాగస్వామ్య సంస్థ నుంచి తీవ్రమైన వేధింపులు ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పారిశ్రామిక వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. సిద్ధార్థ అదృశ్య వార్తలతో కాఫీ డే షేరు ధర 20 శాతం కుప్పకూలింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సిద్ధార్థ  నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు పడిపోయారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

ఇలా అదృశ్యమయ్యారు  
‘సోమవారం సాయంత్రం సకలేశపురకు అని చెప్పి డ్రైవర్‌ బసవరాజు దేశాయితో కలసి వీజీ సిద్ధార్థ బయలుదేరారు. కానీ సకలేశపురకు చేరుకోగానే, అక్కడి నుంచి మంగళూరుకు వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్‌ వద్దనున్న నేత్రావతి నది వద్దకు చేరుకోగానే కారు నిలపమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత కారును వంతెనకు అటువైపు చివరకుతీసుకెళ్లి నిలిపి ఉండు, నేను నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తాను అని చెప్పి దిగేశారు. అయితే వంతెనపై నడుచుకుంటూ ఎంతసేపటికీ రాకపోవడంతో డ్రైవర్‌ వెనక్కి వచ్చి చూడగా  చుట్టుపక్కల ఎక్కడా సిద్ధార్థ కనిపించలేదు. ఫోన్‌ చేస్తేనేమో స్విచ్చాఫ్‌ అయింది. దీంతో డ్రైవర్‌ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు’ అని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ సెంథిల్‌ శశికాంత్‌ సెంథిల్‌ పేర్కొన్నారు. అదృశ్య వార్తను సిద్ధార్థ కుమారుడికి ఫోన్‌ చేసి డ్రైవర్‌ వెల్లడించాడు.. వారు కూడా స్థానిక  కాఫీడే సిబ్బందికి తెలియజేసి గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు  ప్రారంభించింది. సిద్ధార్థ అదృశ్యంపై అతని కారు డ్రైవర్‌ని మంగళూరు పోలీసులు ప్రశ్నించారు. సిద్ధార్థ కాల్‌ డేటా ఆధారంగా అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు.  మంగళూరులో సిద్ధార్థ బస చేసే హోటళ్లు, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని హోటల్లు, బంధువుల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు. 

ఆత్మహత్యా అనుమానాలు  
ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు కారులో వెళుతున్నంత సేపు తన స్నేహితులకు ఫోన్లు చేసి ‘నన్ను క్షమించండి’ అంటూ భాగోద్వేగానికి లోనవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.  కాగా, మంగళూరు నగరంలోని డీసీపీలు హనుమంతరాయ, లక్ష్మి గణేశ్‌ల నేతృత్వంలోని సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, అధికారులు సోమవారం రాత్రి నుంచి సిద్ధార్థ్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్ధార్థ అదృశ్యమైన నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లు, 25 బోట్లు ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. నది చుట్టుపక్కల కూడా వెతుకుతున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి శోధిస్తున్నారు. అలాగే వీరికి కోస్టుగార్డు సిబ్బంది, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా సాయపడుతున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా తీసుకుంటున్నామని, చివరిగా ఆయన ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో కూడా చెక్‌ చేస్తున్నామని మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. 

ఎస్‌ఎం కృష్ణకు నేతల పరామర్శ  
సిద్ధార్థ అదృశ్యంతో బెంగళూరు సదాశివనగరలో ఆయన మామ ఎస్‌ఎం కృష్ణ ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య తదితరులు కృష్ణకు ధైర్యం చెప్పారు.

సిద్ధార్థ నదిలో దూకడాన్ని చూశా 
కాఫీ డే యజమాని సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు సైమన్‌ డిసోజా అనే స్థానిక జాలరి తెలిపారు. తను చేపలకు వల వేస్తుండగా నీటిలోకి ఎవరో దూకిన శబ్దం వినిపించిందని మంగళవారం స్థానిక మీడియాకు తెలిపారు. తను అక్కడికి వెళ్లేలోపు దూకిన వ్యక్తి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ లోపలికి మునిగిపోయాడని చెప్పారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం జరిగినట్లు తెలిపారు.

దేశీ కాఫీ కింగ్‌ సిద్ధార్థ ..
దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్‌ సెక్యూరిటీస్‌ పేరిట ఇన్వెస్ట్‌మెంట్, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కుటుంబ కాఫీ వ్యాపారంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. 1993లో అమాల్గమేటెడ్‌ బీన్‌ కంపెనీ (ఏబీసీ) పేరిట కాఫీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రారంభించారు. అప్పట్లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ సంస్థ వార్షిక టర్నోవరు ఆ తర్వాత రూ. 2,500 కోట్ల స్థాయికి చేరింది. దేశీయంగా ఇది ప్రస్తుతం అతి పెద్ద గ్రీన్‌ కాఫీ ఎగుమతి సంస్థ. ఇక, జర్మన్‌ కాఫీ చెయిన్‌ ’చిబో’ స్ఫూర్తితో సొంత కెఫేలను కూడా సిద్ధార్థ ప్రారంభించారు. తేనీటిప్రియులను కూడా ఘుమఘుమలాడే కాఫీ వైపు మళ్లేలా చేశారు. 1994లో బెంగళూరులో తొలి కెఫే కాఫీ డే ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నా, ప్రాగ్, కౌలాలంపూర్‌ తదితర 200 పైచిలుకు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,750 కెఫే కాఫీ డే అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. 2015లో కాఫీ డే పబ్లిక్‌ ఇష్యూకి కూడా వచ్చింది.  

బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారు: ఐటీ శాఖ 
అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. లేఖలోని సిద్ధార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ  అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు దొరకడంతోనే షేర్లను అటాచ్‌ చేశామని, 2017లో కాఫీ డే గూపు కంపెనీల్లో సోదాలను కూడా చేశామని ఐటీ అధికారులు చెప్పారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు. కాగా, మైండ్‌ ట్రీ షేర్ల విక్రయం ద్వారా సిద్ధార్థకు దాదాపు రూ.3,200 కోట్లు వచ్చాయని.. ఈ డీల్‌ విషయంలో కనీస ప్రత్యామ్నాయ పన్నుగా రూ.300 కోట్లను సిద్ధార్థ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.46 కోట్లను మాత్రమే కట్టారని కూడా ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ వద్ద రూ.362.11 కోట్ల లెక్కలో చూపని ఆదాయం(బ్లాక్‌ మనీ) తో పాటు, తన వద్ద రూ.118.02 కోట్ల నగదు ఉన్నట్లు సిద్ధార్థ ఒప్పకున్నారని ఐటీ వర్గాలు వివరించాయి.

సీసీడీడీలో 6% వాటా ఉంది: కేకేఆర్‌ 
సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఒక పీఈ ఇన్వెస్టర్‌ నుంచి షేర్ల బైబ్యాక్‌ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానంటూ సిద్దార్థ రాసినట్లు చెబుతున్న లేఖలో బయటపడిన నేపథ్యంలో కేకేఆర్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా పీఈ ఫండ్స్‌ ఏడాది నుంచి ఏడేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడులు పెట్టి వైదొలగుతుంటాయని, అయితే తాము మాత్రం సీసీడీ వృద్ధి చెందేంతవరకూ సహకారం అందించి కొంత వాటాను మాత్రమే విక్రయించామని కేకేఆర్‌ వివరించింది. 

బకాయిలేమీ లేవు: హెచ్‌డీఎఫ్‌సీ 
సిద్ధార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్‌డీఎఫ్‌సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌ బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌పార్క్‌ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్‌ ప్రైజెస్‌ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

పరిస్థితిని సమీక్షిస్తున్నాం: సీసీడీ 
సిద్ధార్థ అదృశ్యంతో సీసీడీ డైరెక్టర్ల బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. సిద్దార్థ రాసినట్లు బయటికొచ్చిన లేఖలోని అంశాలను సమీక్షించడంతోపాటు లేఖ కాపీలను సంబంధిత అధికారులకు అందజేసినట్లు కంపెనీ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగిన చర్యలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ‘సిద్దార్థ అదృశ్య సంఘటనతో మేం షాక్‌కు గురయ్యాం. ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులకు మా పూర్తి మద్దతను తెలియజేస్తున్నాం. ఆయన ఆచూకీ కోసం మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. నిపుణులైన నాయకత్వంలో కంపెనీ నడుస్తున్నందున వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి’ అంటూ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది.

మైండ్‌ట్రీ డీల్‌తో రూ.3,200 కోట్లు
కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో కార్యకలాపాలు విస్తరించారు. ఐటీ రంగంలో ప్రవేశించి గ్లోబల్‌ టెక్నాలజీ వెంచర్స్‌ని ఏర్పాటు చేశారు. అటు ఆర్థిక సేవలు అందించే శివన్‌ సెక్యూరిటీస్‌ కింద చేతన్‌ ఉడ్‌ ప్రాసెసింగ్, బేర్‌ఫుట్‌ రిసార్ట్స్‌ (ఆతిథ్య రంగం), డార్క్‌ ఫారెస్ట్‌ ఫర్నిచర్‌ (కలప వ్యాపారం) పేరిట మరో మూడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారు. 1999లో సుబ్రతో బాగ్చీ, కేకే నటరాజన్, రోస్టో రవనన్‌లు మైండ్‌ట్రీ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సిద్ధార్థను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకొచ్చారు ఐటీ రంగంలో సీనియర్‌ అయిన అశోక్‌ సూతా. ఒక దశలో మైండ్‌ట్రీలో ఆయన అతి పెద్ద వాటాదారు కూడా. ఈ ఏడాది మార్చిలోనే తనకున్న 20.41 శాతం వాటాలను లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)కి విక్రయించారు. ఈ వివాదాస్పద డీల్‌ ద్వారా  రూ. 3,200 కోట్లు వచ్చాయి. దాదాపు రూ. 2,900 కోట్ల రుణభారాన్ని ఈ నిధులతో తగ్గించుకున్నారు. 

అప్పుల కుప్ప.. కాఫీ డే 
కాఫీ డే చెయిన్‌ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 6,550 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. రుణాలతో పాటు నష్టాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దేశీయంగా కాఫీ ఉత్పత్తి తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కీలకమైన సిద్ధార్థ వ్యాపారాన్ని గట్టిగానే దెబ్బతీసింది.  అయితే, రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించేసిన సిద్ధార్థ.. ఇతర వ్యాపారాల్లో కూడా వాటాలను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. రూ. 10,000 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువతో కెఫే కాఫీ డే (సీసీడీ)లో కొంత వాటాలను కోక కోలా సంస్థకు అమ్మేసేందుకు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. రియల్టీ రంగంలో సిద్ధార్థ నెలకొల్పిన టాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌లో దాదాపు రూ. 2,800 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

మంగళవారం నేత్రావతి నది వంతెన వద్ద గాలింపు చర్యలు

2
2/2

చివరిసారిగా సిద్ధార్థ ప్రయాణించిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement