ప్లాన్‌తోనే ఫండింగ్ చేద్దాం..! | consider mutual fund schemes, systematic Investment plans before investment | Sakshi
Sakshi News home page

ప్లాన్‌తోనే ఫండింగ్ చేద్దాం..!

Published Sun, Jul 20 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

ప్లాన్‌తోనే ఫండింగ్ చేద్దాం..!

ప్లాన్‌తోనే ఫండింగ్ చేద్దాం..!

చాలా సందర్భాల్లో ఆర్థిక లక్ష్యాల కంటే విహార యాత్రలకు చక్కటి ప్లానింగ్ చేసుకుంటాం. బహుశా దీనికి ప్రధాన కారణం విహార యాత్రలకు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా సులభమై ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? ఎంత దూరం, డబ్బు ఎంత అవసరం అవుతుంది... అని ఎలా ముందుకు లెక్కలు వేసుకుంటామో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా అదే విధంగా సిద్ధం కావాలి. మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్సే అనుకుంటారు.
 
వివిధ అవసరాలకు అనుగుణంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయన్న సంగతి తెలియదు. ఉదాహరణకు ఈక్విటీ పథకాల విషయానికి వస్తే.. అందులోనే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, డైవర్సిఫైడ్, థీమాటిక్ వంటి భిన్నమైన పథకాలున్నాయి. ఇవి కాకుండా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్ (లిక్విడ్, షార్ట్‌టర్మ్, డైనమిక్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఎఫ్‌ఎంపీ), హైబ్రీడ్ ఫండ్స్ ( బ్యాలెన్స్‌డ్, ఎంఐపీ) వంటి అనేక పథకాలున్నాయి. మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాలు దోహదం చేస్తాయి. లక్ష్యానికి అనుగుణంగా సరైన పథకాన్ని ఎంచుకుంటే విజయలక్ష్మి మిమ్మల్ని వరించడం ఖాయం.
 
మ్యూచువల్ ఫండ్స్‌తో పోర్ట్‌ఫోలియో తయారు చేసుకునేటప్పుడు అందులో ఏ విధమైన పథకాలుండాలి, పరిశీలించాల్సిన అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం...

ఎక్కడున్నారు?
ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకునే ముందు ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా మీరు ఎక్కడున్నారు? ఆర్థిక లక్ష్యం ఏమిటి? అన్న వాటిపై ముందుగా స్పష్టత ఏర్పర్చుకోవాలి. దీనికి అనుగుణంగా మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, ఫిక్స్‌డ్, బంగారం వంటి వాటికి ఎంతెంత కేటాయించాలో నిర్థారించుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు మీ ఆర్థిక లక్ష్యాలు, దానికి ఎంత మొత్తం అవసరమవుతుంది అన్నది కాగితంపై రాసుకోండి. సొంతింటి నిర్మాణం, కొత్త కారు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇలా ఏదైనా సరే లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దానికి ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి.
 
ఎప్పటిలోగా...

లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత వీటిని చేరుకోవడానికి ఎంత కాలపరిమితి ఉందనేది కీలకమైనది. కాలపరిమితి ఆధారంగా ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్ష్యం దీర్ఘకాలమై, 10 కంటే ఎక్కువ ఏళ్లు ఉంటే అప్పుడు ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అదే మధ్య కాలిక లక్ష్యాల (4-8 ఏళ్లు)కైతే కొద్దిగా రిస్క్ తక్కువగా ఉండే హైబ్రీడ్ ఫండ్స్, అదే 2-3 ఏళ్ల స్వల్పకాలిక లక్ష్యాలకు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పథకాలు అనువుగా ఉంటాయి.
 
పెరిగే ధరలు..
ధరలు ఏటా పెరుగుతుంటాయి. అందుకే ఇప్పటి ధరల ఆధారంగా కావాల్సిన మొత్తాన్ని నిర్దేశించుకుంటే.. చివర్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతారు. అందుకే లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు మీరు కొందామనుకున్న కారు ధర రూ. 5 లక్షలు ఉందనుకుందాం. కానీ కారు కొనేది మూడేళ్ల తర్వాత. ఏటా సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉందనుకుంటే  మూడేళ్లలో ఇదే లక్ష్యాన్ని చేరుకోవడానికి రూ. 5.79 లక్షలు అవసరమవుతాయి. దీని ప్రకారం మీ లక్ష్యాలకు కావల్సిన మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.
 
ఎంత దాచగలరు?
చాలామంది పొదుపు అనగానే ఒకేసారి పెద్ద మొత్తాన్ని బ్యాంకు డిపాజిట్లు, బీమా పథకాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. దీని వల్ల జేబుకు అంత భారం ఉండదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో సిప్ విధానమే బెస్ట్. ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తాన్ని బట్టి కాలపరిమితి తీరిన తర్వాత ఎంత మొత్తం వస్తుందన్న విషయంపై కూడా ఒక అవగాహనకు రావచ్చు. ఉదాహరణకు లార్జ్‌క్యాప్ ఫండ్స్ గడిచిన పదేళ్లలో సిప్ విధానంలో 14-15 శాతం రాబడిని అందిస్తే, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ 12.5 శాతం, ఇన్‌కమ్ ఫండ్స్ 8 శాతం రాబడిని ఇచ్చాయి.  ఈ ప్రకారం చూస్తే మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి.
 
నష్ట భయాల మాటేంటి?..
పోర్ట్‌ఫోలియో పథకాల ఎంపికలో రిస్క్ సామర్థ్యం అనేది అత్యంత కీలకమైన అంశం. నష్టభయాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంటే రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ పథకాలకు ఎక్కువ కేటాయించుకోవచ్చు. మీ వయస్సు, ఇప్పటి వరకు పొదుపు చేసిన మొత్తం, లక్ష్య కాలపరిమితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు.
 
నిర్వహణ ముఖ్యమే...
మ్యూచువల్ ఫండ్ పథకాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ), సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూ) వంటి అనేక నిర్వహణ అవకాశాలను కల్పిస్తోంది. వీటి ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకుంటే... రిస్క్ తక్కువగా ఉండే పథకాల్లోకి ఎస్‌టీపీ ద్వారా మార్చుకోవచ్చు. అలాగే రిటైర్‌మెంట్ తర్వాత అవసరాల కోసం ఎస్‌డబ్ల్యూను వినియోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement