సిద్ధి గణపయ్యకు డీమ్యాట్ ఖాతా
♦ సీడీఎస్‌ఎల్ సంస్థ నుంచి ప్రారంభం
♦ఎలక్ట్రానిక్ విధానంలో షేర్ల బదిలీకి అవకాశం
♦డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు ఆలయాలు, మత సంస్థల ఆసక్తి
♦ఆదాయం పెంచుకునే ఆలోచన...
♦ఇప్పటికే 50కు పైగా ప్రారంభం
ముంబై: దేశంలోనే సంపన్న గణనాథుడిగా భక్తులతో పూజలందుకుంటున్న ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం... భక్తుల షేర్లను విరాళంగా స్వీకరించేందుకు డీమ్యాట్ ఖాతా ప్రారంభించింది. ఆలయ వ్యవహారాలను చూసే ‘శ్రీ సిద్ధి వినాయక్ గణపతి టెంపుల్ ట్రస్ట్(ప్రభావతి)’ పేరుతో ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ద్వారా ఈ ఖాతా తెరిచారు. 12047200 11413505 నంబర్‌తో ఉన్న ఖాతా ప్రారంభ కిట్‌ను ఆలయ ట్రస్ట్‌కు మంగళవారం ఇక్కడ సీడీఎస్‌ఎల్ సంస్థ అందజేసింది. భక్తులు ఇకపై సిద్ధి వినాయకుడికి స్టాక్ మార్కెట్లో చురుగ్గా ట్రేడయ్యే షేర్లను, సెక్యూరిటీలను విరాళంగా ఇచ్చే అవకాశం ఏర్పడినట్టు సీడీఎస్‌ఎల్ ఎండీ, సీఈవో పీఎస్ రెడ్డి మంగళవారం ముంబైలో తెలిపారు. ఎలాంటి షేర్లను విరాళంగా ఇవ్వవచ్చన్న వివరాలను సిద్ధివినాయక డాట్ ఓఆర్‌జీ వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చని చెప్పారాయన.
టీటీడీ బాటలో...: గతేడాది దేశంలోనే తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భక్తుల నుంచి షేర్ల రూపంలో విరాళాలను అందుకునేందుకు డీమ్యాట్ ఖాతాను ప్రారంభించింది. దీనికి భక్తుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. దీంతో దేశంలోని ఇతర ఆలయాలు కూడా టీటీడీ బాటలోనే అడుగులేశాయి. మత సంస్థలు, పలు చర్చిలు, మసీదులు కూడా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించాయి. సుమారు 50కు పైగా మత సంస్థలు డీమ్యాట్ ఖాతాలు తెరిచినట్టు సమాచారం. వీటిలో వైష్ణోదేవి ఆలయం, స్వామి నారాయణ్ ఆలయం, శంకరాచార్య ఆలయం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయం, అంబానీలు కొలిచే నత్‌ద్వారా, ముంబై బాబుల్‌నాథ్ మందిరం, వర్ధమాన్ మహావీర్ ఆలయం మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. కాకపోతే ఆలయ ట్రస్ట్‌బోర్డ్ లేదా మత సంస్థ పేరిట పాన్ నంబర్ తీసుకున్న తర్వాతే డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంటుంది.