హలో, మూవ్స్, టీబీహెచ్ యాప్స్ మూసివేత
న్యూఢిల్లీ : సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ మూడు యాప్స్‌ను మూసేస్తోంది. హలో, మూవ్స్, టీబీహెచ్ అనే యాప్స్‌ను మూసేస్తున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. తక్కువ వాడకం కారణంతో ఈ యాప్స్‌ను తీసేస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రెజిల్, అమెరికా, నైజిరియాలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 2015లో హలో యాప్‌ను ఫేస్‌బుక్ లాంచ్‌చేసింది. ఇది యూజర్ల ఫేస్‌బుక్ సమాచారాన్ని, ఫోన్‌లోని కాంటాక్ట్ సమాచారంతో కలుపుతూ ఉంటుంది. మరికొన్ని వారాల్లోనే కంపెనీ హలో యాప్‌ను తీసేయబోతుంది. ఇక రెండో యాప్ మూవ్స్. ఈ ఫిట్‌నెస్ యాప్‌ను 2014లో ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. యూజర్ల రోజువారీ కార్యకలాపాలు వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వంటి వాటిని రికార్డు చేయడం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. జూలై 31 నుంచి ఈ యాప్‌ను ఫేస్‌బుక్ మూసేస్తుంది.
ఇక చివరి యాప్ టీబీహెచ్. గతేడాదే దీన్ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. అమెరికాలోని హైస్కూల్ విద్యార్థులకు ఈ సోషల్ మీడియా యాప్ సుపరిచితమే. ప్రస్తుతం తొలగిస్తున్న ఈ యాప్స్‌లోని యూజర్ల డేటాను 90 రోజుల్లో తొలగిస్తామని కంపెనీ చెప్పింది. తరుచూ తమ యాప్స్‌పై సమీక్ష చేపడుతూ ఉంటామని, ఈ సమీక్షలో తక్కువగా వాడే యాప్స్‌ను తొలగించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కొంతమంది యూజర్లు ఇంకా ఈ యాప్స్‌ను వాడుతున్నారని, వారికి ఇది నిరాశ కలిగించే అంశమని, మీ సపోర్టు తమకు అందించినందుకు కృతజ్ఞతలని కంపెనీ తెలిపింది. తాజాగా ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్ స్నూజ్‌ను పరిశీస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్ ద్వారా కొన్ని పోస్టులను 30 రోజుల పాటు మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ టెస్టింగ్‌ను ఫేస్‌బుక్, టెక్‌క్రంచ్‌కు ధృవీకరించింది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ ఆవిష్కరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment