దశలవారీగా భారత్‌కు విదేశీ బ్రాండ్లు
నవంబర్‌లోనే మార్కెట్లోకి అబర్త్
* 2015లో జీప్ బ్రాండ్ తీసుకొస్తాం
* సాక్షితో ఫియట్ క్రిస్లర్ ప్రెసిడెంట్ నగేష్ బసవనహళ్లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ దశలవారీగా అంతర్జాతీయ బ్రాండ్లను భారత్‌కు పరిచయం చేయనుంది. ఈ ఏడాది నవంబరులోనే అబర్త్ దేశీయ మార్కెట్లో అడుగుపెడుతోంది. 2015లో జీప్ బ్రాండ్ రానుంది. ఫియట్ క్రిస్లర్ వివిధ దేశాల్లో ఫియట్, అల్ఫా రోమియో, డాడ్జ్, లాన్సియా, ర్యామ్, ఎస్‌ఆర్‌టీ బ్రాండ్స్‌లోనూ పలు మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్ స్పందననుబట్టి వీటిని ఇక్కడ ప్రవేశపెడతామని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ప్రెసిడెంట్, ఎండీ నగేష్ బసవనహళ్లి బుధవారం తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ అవెంచురాను విడుదల చేసిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
ఒకదాని వెంట ఒకటి..
వచ్చే ఐదేళ్లలో కనీసం 12 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. వీటిలో తొలుత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ అబర్త్ 500 రానుంది. ధర రూ.25 లక్షల దాకా ఉండే అవకాశం ఉంది. 2015లో పుంటో ఇవో అబర్త్‌ను తీసుకు రానున్నారు. అలాగే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ బ్రాండ్ అయిన జీప్ వచ్చే ఏడాది భారత్‌లో అడుగు పెడుతోంది. జీప్ బ్రాండ్‌లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీలు అధికంగా అమ్ముడయ్యే మోడల్స్. వీటినే భారత్‌కు తీసుకు వచ్చే అవకాశం ఉంది. జీప్ బ్రాండ్ వాహనాలను 2015 నాటికి దేశంలో తయారు చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఇక రెండేళ్ల పరిశోధన అనంతరం అవెంచురా రోడ్డెక్కింది. 500పైగా ప్రీ బుకింగ్స్‌ను అవెంచురా సొంతం చేసుకుంది. 15 వేలకుపైగా ఎంక్వైరీలు నమోదయ్యాయి.
డిమాండ్‌నుబట్టి..
కస్టమర్లు తమ అవసరాన్నిబట్టి పెట్రోలు/డీజిల్ కారును ఎంచుకుంటారని నగేష్ తెలిపారు. ‘రెండు రకాల ఇంజిన్లను తయారు చేసే సామర్థ్యం మాకుంది. మార్కెట్ డిమాండ్‌నుబట్టి ఇంజిన్ల తయారీ చేపడతాం’ అని అన్నారు. 2014-15 తర్వాతి నుంచి ప్రయాణికుల వాహన పరిశ్రమ వృద్ధి బాటన పయనిస్తుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పండుగ అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించారు. మార్కెట్ సెంటిమెంటు తిరిగి పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయని వివరించారు. వ్యాపార అవకాశాలు ఉన్న అన్ని నగరాల్లో డీలర్‌షిప్ కేంద్రాలను తెరుస్తామని, ఔత్సాహికులు ఎవరైనా ముందుకు రావొచ్చని చెప్పారు.