
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్ల ముద్రణ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఆర్‌బీఐ అనుబంధ నోట్ల ముద్రణ విభాగం నిరాకరించింది. 2016 నవంబర్ 9 నుంచి అదే నెల 30వ తేదీ మధ్య ఎన్ని రూ.2,000 నోట్లు, రూ.500 నోట్లను ముద్రించారో సమాచారమివ్వాలని కోరుతూ హరీందర్ దింగ్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సరైన స్పందన రాకపోవడంతో ఆయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు (సీఐసీ) అప్పీలు చేసుకున్నాడు. ఆర్‌బీఐకి చెందిన ‘భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ లిమిటెడ్’ సీఐసీకి తన వాదనలు వినిపిస్తూ... కరెన్సీ నోట్ల ముద్రణ, సంబంధిత వివరాలను ప్రజలతో పంచుకోరాదని, ఇది నకిలీ కరెన్సీ వ్యాప్తి, ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని చెప్పింది.
ఇది పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారంగా పేర్కొంది. ఈ సమాచారాన్ని వెల్లడిస్తే అది దేశ సమగ్రతకు, సౌర్వభౌమత్వం, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ) కింద ఈ సమాచారానికి మినహాయింపు ఉందని తెలియజేసింది. అయితే ఈ వాదనలను సీఐసీ భార్గవ తోసిపుచ్చారు. రోజువారీగా ఎన్ని నోట్లను ముద్రించారన్న సమాచారం అంత సున్నితమైనదేమీ కాదని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment