రూపీ.. మళ్లీ ‘లో’బీపీ!
* 69 పైసలు పతనం
* 64.23 వద్ద ముగింపు
* 20 నెలల కనిష్టానికి క్షీణత...
* వరుసగా 5 సెషన్లలో 1.71% డౌన్
ముంబై: మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్న నేపథ్యంలో రూపాయి మారకం విలువ వరుసగా అయిదో సెషన్లోనూ క్షీణించింది. గురువారం డాలర్‌తో పోలిస్తే ఏకంగా 20 నెలల కనిష్ట స్థాయి 64.23కి పడిపోయింది.
దిగుమతి సంస్థలు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ నెలకొనడం, ముడి చమురు ధరలు పెరగడమూ దేశీ కరెన్సీపై గణనీయంగా ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్ డీలర్లు వివరించారు. అయితే, అంతర్జాతీయంగా డాలర్ కాస్త బలహీనంగా ఉండటంతో రూపాయి నష్టాలకు కొంత బ్రేక్ పడిందని పేర్కొన్నారు. కనీస ప్రత్యామ్నాయ పన్నులపై ఆందోళనలతో విదేశీ నిధులు వెల్లువలా తరలిపోతుండటం, పన్నులపరంగా కీలకమైన సంస్కరణల ఆమోదానికి పార్లమెంట్‌లో జాప్యం జరుగుతుండటం తదితర అంశాలు రూపాయి.. 20 నెలల కనిష్టానికి పడిపోవడానికి దారితీశాయని డీలర్లు వివరించారు.
గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.54తో పోలిస్తే బలహీనంగా 63.78 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత 64 స్థాయి దిగువకి పడిపోయి ఒక దశలో 64.28కి కూడా క్షీణించింది. రోజంతా 63.69-64.28 శ్రేణిలో తిరుగాడిన రూపాయి.. చివరికి 69 పైసల నష్టంతో (1.09%) 64.23 వద్ద ముగిసింది. 2013 సెప్టెంబర్ 6 తర్వాత ఇంత బలహీన స్థాయి దగ్గర ముగియడం ఇదే ప్రథమం. అప్పట్లో 65.24 వద్ద క్లోజయ్యింది. గడిచిన అయిదు సెషన్లలో దేశీ కరెన్సీ 108 పైసలు (1.71%) క్షీణించింది. ఇకపై స్పాట్ మార్కెట్లో రూపాయి 63.80-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.
మరింత కిందికే...!
బుధవారం భారీగా అమ్మకాలకు దిగిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) గురువారం రూపాయిలను డాలర్లలోకి మార్చుకోవడం వల్ల దేశీ కరెన్సీ పతనం కొనసాగిందని పరిశీలకులు తెలిపారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడం వల్ల రూపాయి పతనానికి కొంత మేర అడ్డుకట్ట పడినట్లయిందని వివరించారు. 63.90 స్థాయి నుంచి బ్యాంకులు డాలర్లను విక్రయిస్తూనే ఉన్నప్పటికీ.. డాలర్లకు మరింత డిమాండ్ నెలకొందని పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఐలు భారత్ కన్నా మెరుగైన రాబడులిచ్చే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంతో ఇక్కడ తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే కొన్ని సెషన్లలో రూపాయి మారకం విలువ 64.50 స్థాయిని తాకవచ్చన్నారు. దేశీ స్టాక్‌మార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌తో పాటు క్రూడ్‌ఆయిల్ రేట్లు, యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగవచ్చన్న ఆందోళనలు రూపాయిపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.