భారత వృద్ధికి ఎన్నో సవాళ్లు: మూడీస్
♦ అధిక స్థాయిలో కార్పొరేట్ రుణాలు
♦ మొండిబకాయిల పెరుగుదలతో రుణాల లభ్యతపై ప్రభావం
♦ దీర్ఘకాలంలో భారత్ మెరుగ్గా రాణించే అవకాశముందని వెల్లడి
న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో భారత వృద్ధి రేటుకు ఎన్నో సవాళ్లు పొంచి ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. రాజకీయ వైరంతో సంస్కరణలకు అడ్డుపడే ధోరణితో కీలక బిల్లులు నిలిచిపోవడాన్ని అసాధారణ స్థితిగా పేర్కొంది. అంతర్జాతీయంగా గిరాకీ మందగించడం, కార్పొరేట్ రుణాలు అధిక స్థాయిలో ఉండడం, రుణాల లభ్యత తగ్గడం వృద్ధి రేటుకు సవాళ్లుగా పేర్కొంది. ఇవే రానున్న కొన్ని త్రైమాసికాలపాటు పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది. అంతేకాదు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ దేశీయంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు 2016లో మార్కెట్ సెంటిమెంట్‌ను ఒత్తిడికి గురిచేయవచ్చంటూ ‘ఇన్‌సైడ్ ఇండియా’ నివేదికలో మూడీస్ పేర్కొంది. అయితే, నిర్దేశించుకున్న సంస్కరణలను క్రమంగా అమలు చేయడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడడం, మౌలిక వసతులు, ఉత్పాదకత పెరుగుదల వల్ల మధ్యకాలానికి భారత్ రాణిస్తుందని భావిస్తున్నట్టు మూడీస్ తెలిపింది.
‘పలు కార్పొరేట్ సంస్థలు అధిక స్థాయిలో తీసు కున్న రుణాల ప్రభావం వృద్ధిరేటుపై గణనీయంగా ఉంటుంది. రుణాల గిరాకీపై కూడా ప్రభావం చూపుతుంది. బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులు రుణాల లభ్యతకు విఘాతం. దిగువ స్థాయిలో నామమాత్రపు వృద్ధిరేటు కొనసాగడం ప్రభుత్వ రాబడులను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి సంస్కరణలు చేపట్టేందుకు... ఇంటా, బయట ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రభుత్వం ముందున్న అవకాశాలు పరిమితం. రానున్న రెండు సంవత్సరాల్లో భారత జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందుతున్న మా అంచనాలను ఈ పరిణామాలు ప్రభావితం చేస్తాయి’ అని మూడీస్ పేర్కొంది.
ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవడం వల్ల భారత్‌పై ప్రభావం నామమాత్రమేనని, భారత్ నుంచి ఈయూకు దిగుమతులు కేవలం 0.4 శాతంగానే ఉన్నాయని, ఇవి జీడీపీలో 1.7 శాతమని వివరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను భారీగా పెంచడం వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని అభిప్రాయపడింది.