హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్‌ఈడీ టీవీల మార్కెట్‌లో ‘అఫర్డబుల్’ విభాగం హవా నడుస్తోంది. 24–55 అంగుళాల శ్రేణిలో పెద్ద బ్రాండ్ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ క్రమంగా తన వాటాను పెంచుకుంటోంది. రూ.7 వేలతో మొదలై రూ.35 వేల శ్రేణిలో అతి తక్కువ ధరలతో టీవీల రంగంలో సంచలనానికి కారణమైన అందుబాటు ధరల (అఫర్డబుల్) విభాగం వాటా ప్రస్తుతం 32 శాతంగా ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 65 శాతానికి చేరుతుందనేది మార్కెట్ వర్గాల అంచనా. ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుని వాటాను పెంచుకోవచ్చన్నదే ఈ రంగంలోని కంపెనీల ప్రధాన ధీమా. ఎంఐ, కొడాక్, థామ్సన్, బీపీఎల్, హోమ్, టీసీఎల్, శాన్యో, వ్యూ, రికనెక్ట్, ఒనిడా, షార్ప్, స్కైవర్త్, అకాయ్ వంటి బ్రాండ్లు దిగ్గజాలతో పోటీపడుతూ ‘స్మార్ట్’గా మార్కెట్‌ను కైవసం చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇవి పెద్ద తెరల విభాగంలో (32 అంగుళాలకన్నా ఎక్కువ) క్రమంగా తమ వాటాను పెంచుకుంటున్నాయి.
ఇదీ ఎల్‌ఈడీల మార్కెట్..
దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీ టీవీల రంగంలో 70కిపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఏటా 1.4 కోట్ల యూనిట్ల ఎల్‌ఈడీ టీవీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో అందుబాటు ధరల విభాగానిది 32 శాతం వాటా. వచ్చే అయిదేళ్లలో ఇది 65 శాతానికి చేరడం ఖాయమని భారత్‌లో కొడాక్, థామ్సన్ టీవీ బ్రాండ్ల లైసెన్స్ కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మొత్తం విపణిలో స్మార్ట్ టీవీల వాటా 70 శాతముంది. అలాగే ఆన్‌లైన్ విక్రయాలు 27 శాతం, ఆఫ్‌లైన్ అమ్మకాలు ఏకంగా 73 శాతం ఉన్నాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాదిరిగా అందుబాటు ధరల్లో, మంచి ఫీచర్లతో విక్రయించే మోడళ్లే ఇటు టీవీల రంగంలోనూ నిలదొక్కుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అఫర్డబుల్ విభాగంలో హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీతోపాటు 4కే టీవీలూ వచ్చేశాయి. రూ.22,000 కోట్ల ఎల్‌ఈడీ టీవీల విపణిలో 43–55 అంగుళాల విభాగం వాటా 30 శాతముంది. ఈ విభాగమే వేగంగా వృద్ధి చెందుతోంది.
ఆన్‌లైన్ ఆసరాగా..
ఆఫ్‌లైన్ విభాగంలో లార్జ్ ఫార్మాట్ స్టోర్లయినా, చిన్న దుకాణమైనా పెద్ద బ్రాండ్ల హవానే నడుస్తోంది. ఆ స్థాయిలో దుకాణాల్లో స్థలాన్ని పెద్ద కంపెనీలు ఆక్రమించేశాయి. చిన్న బ్రాండ్లకు చోటు లేకుండా పోయింది. దీంతో చిన్న కంపెనీలు ఆన్‌లైన్‌ను ఆశ్రయించాయి. అఫర్డబుల్ సెగ్మెంట్ బ్రాండ్ల టీవీల అమ్మకాల్లో ఆన్‌లైన్ వాటా ఏకంగా 70 శాతముందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘ఉదాహరణకు టీవీ కోసం ఒక కస్టమర్ వెచ్చించే స్థాయి రూ.30 వేలు అనుకుందాం. పెద్ద కంపెనీతో పోలిస్తే అందుబాటు ధరలో లభించే బ్రాండ్‌లో ఈ వ్యయంతో పెద్ద తెరతో టీవీ వస్తుంది. అలాంటప్పుడు వినియోగదారుడు పెద్ద టీవీ వైపే మొగ్గు చూపుతాడు. పైపెచ్చు నాణ్యత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఫీచర్లు అంటారా బోలెడన్ని ఉంటున్నాయి’ అని ఓ విక్రేత వివరించారు. చిన్న బ్రాండ్లు సర్వీసింగ్‌పై మరింత ఫోకస్ చేస్తే అమ్మకాలు అధికం అవుతాయని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కర్ మూర్తి అభిప్రాయపడ్డారు. అఫర్డబుల్ బ్రాండ్ల టీవీల స్క్రీన్ శాంసంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్లు తయారు చేసినవే ఉంటున్నాయి.
‘బిగ్ స్క్రీన్’పై చిన్న బ్రాండ్లు
Published Thu, Feb 14 2019 12:50 AM | Last Updated on Thu, Feb 14 2019 12:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment