
ఇక హైస్పీడ్‌లో రైల్వేల అభివృద్ధి..!
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ అభివృద్ధిని ప్రేరేపించేదిగా ఉందని వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వ్యాఖ్యానించాయి. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై దృష్టిపెట్టడంతో మౌలిక సౌకర్యాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపాయి. ‘భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కావలసిన నిధుల్లో భారీ మొత్తాన్ని పీపీపీ మార్గం ద్వారా సమీకరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం.
ఈ ప్రతిపాదనతో నిధుల కొరతను అధిగమించవచ్చు. రైల్వేల ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు...’ అని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సరకు రవాణా టెర్మినళ్లను, లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతామని రైల్వే మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. హైస్పీడ్ రైళ్లతో సహా భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టులకు నిధులను ప్రధానంగా పీపీపీలోనే సమకూరుస్తామని చెప్పారు.
ఎఫ్‌డీఐ అనుమతిపై హర్షం...
మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల్లో ఎఫ్‌డీఐని అనుమతించే యోచన హర్షణీయమని అల్‌స్టోమ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా ఎండీ భరత్ సల్హోత్రా అన్నారు. అరకొర నిధులతో సతమతమవుతున్న భారతీయ రైల్వేలకు ఈ నిర్ణయంతో పుష్కల ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశీయ రైల్వే రంగంలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలను త్వరగా ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌డీఐలు దోహదపడతాయని అన్నారు.
బడ్జెట్లో చేసిన ప్రకటనలు రైల్వే మౌలిక సౌకర్యాల మెరుగుకు, ఉపాధి అవకాశాల కల్పనకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపురియా పేర్కొన్నారు. ‘ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచారు. అధికార దాహంతో కూడిన పథకాలేవీ లేవు. మార్కెట్లు ఇంతకంటే ఏం ఎక్కువ ఆశించాయి?...’ అని మహింద్రా అండ్ మహింద్రా సీఎండీ ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు.
పెట్టుబడుల ప్రవాహం...
పీపీపీ పద్ధతిని పాటించడం వల్ల ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ చెప్పారు. మోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి అత్యంత విశ్వసనీయత ఉందని అన్నారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియతో రైల్వే రంగం నిజమైన జీవన రేఖగా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు. పీపీపీ పద్ధతిలో రేవులను అనుసంధానిస్తామనీ, ప్రైవేట్ పార్టీల ద్వారా పార్శిల్ వ్యాన్లు, ర్యాకులను సమీకరిస్తామనీ కూడా రైల్వే మంత్రి వెల్లడించారు. రైల్వేల సామర్థ్యం మెరుగుపడితే రవాణా వ్యయం తగ్గుతుందనీ, తద్వారా ఎగుమతిదారులకు మేలు జరుగుతుందనీ ఈఈపీసీ ఇండియా చైర్మన్ అనుపమ్ షా తెలిపారు.
ఉట్టిపడిన వాస్తవికత...
కీలకమైన రైల్వే రంగంలో మౌలిక సౌకర్యాలను, సామర్థ్యాన్నీ పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను రైల్వే బడ్జెట్లో విస్పష్టంగా ప్రకటించారని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ ఎస్.శ్రీరామ్ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఐఐ హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు.
వాస్తవిక దృక్పథంతో కూడిన బడ్జెట్‌ను మంత్రి సమర్పించారని సీఐఐ అధ్యక్ష పదవికి ఎన్నికైన సుమీత్ మజుందార్ చెప్పారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించేవిగా ప్రాజెక్టులను రూపొందిస్తే పీపీపీ, ఎఫ్‌డీఐ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆరు కొత్త రైళ్లను మంజూరు చేయడంపై సీఐఐ చైర్మన్ (ఆంధ్ర, తెలంగాణ) సురేశ్ చిట్టూరి సంతోషం వ్యక్తంచేశారు.
ఉక్కు వినియోగం పెరుగుతుంది..
రైల్వే ట్రాకుల డబ్లింగ్, ట్రిప్లింగ్, స్టేషన్ల ఆధునీకరణ, మీటర్ గేజ్ పట్టాలను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం వంటి చర్యలతో ఉక్కు వినియోగం పెరగనుందని సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ, ఐటీ, వివిధ ప్రాజెక్టుల అమలుపై బడ్జెట్లో దృష్టి సారించారనీ, దేశీయ రైల్వేల పనితీరు మెరుగుకు దోహదపడుతుందనీ భారతీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు ఎం.రఫీక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. గేజ్ మార్పిడి, కొత్త పట్టాల ఏర్పాటుతో రైల్వేల సామర్థ్యం పెరుగుతుందని ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీ వినీత్ అగర్వాల్ చెప్పారు.