మొబైల్‌లోనే మీ ఆధార్
మొబైల్‌లోనే మీ ఆధార్
Published Wed, Jul 19 2017 5:42 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
ప్రస్తుతం ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారమవుతోంది. ఎక్కడికి పోయినా మొదట దీన్నే అడుగుతున్నారు. దీంతో కచ్చితంగా మన పర్స్‌లో ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధార్‌ను మర్చిపోయి, ఏదైనా పనిమీద వెళ్తే, అక్కడ పడే తిప్పలు వర్ణనాతీతం. అయితే దీనికి పరిష్కారం వచ్చేసింది. ఆధార్ కార్డును పర్స్‌లో కచ్చితంగా పట్టుకెళ్లాల్సినవసరం లేకుండా.. ఫోన్‌లోనే దీన్ని తీసుకెళ్లేలా యూనిక్ ఐడెంటిఫికేసన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఎంఆధార్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. దీంతో మొబైల్‌లోనే ఆధార్ కార్డును తీసుకెళ్లవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ యాప్ ఆధార్ ప్రొఫైల్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఈ యాప్ ద్వారా లింక్ అయ్యే ఆధార్ యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు. దీంతో మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయి.
క్విక్ రెస్పాన్స్ కోడ్‌తో అప్‌డేటెడ్ ఆధార్ ప్రొఫైల్‌ను షేర్ చేయడానికి, చూడటానికి ఇది ఉపయోగపడుతోంది. ఈకైవైసీ వివరాలను టెలికాం కంపెనీల వంటి సర్వీసు ప్రొవైడర్లకు షేర్ చేయవచ్చు. ఎంఆధార్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ ద్వారానే ఇది సాధ్యపడుతోంది. ఆధార్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదని తెలిసిందే. పాన్ కార్డును కూడా ఆధార్‌తో లింక్‌చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది. బ్యాంకు అకౌంట్లకు ఈ ఏడాది చివరికల్లా ఆధార్‌లను లింక్ చేసుకోవాలని, లేనిపక్షంలో ఆ అకౌంట్లు బ్లాక్ అవుతాయిన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఈ యాప్‌ను తీసుకురావడం విశేషం.
Advertisement