హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం..చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్
అట్లాంటిక్ సముద్రంలో 6,600 కి.మీ. కేబుల్ ఏర్పాటుకు ప్రయత్నం
శాన్‌ఫ్రాన్సిస్కో: హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు రెండూ చేతులు కలిపాయి. అట్లాంటిక్ సముద్రం అడుగున కేబుల్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ ఒకే వేదికపైకి వచ్చాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, క్లౌడ్ సేవల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దాన్ని అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు 6,600 కిలోమీటర్ల మేర కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
దీనికి ‘మరియా’ అని నామకరణం చేశాయి. దీని సామర్థ్యం 160 టీబీపీఎస్‌గా ఉంటుందని అంచనా. దీంతో అట్లాంటిక్ సముద్రంలో నిర్మితమౌతున్న అత్యధిక సామర్థ్యం ఉన్న కేబుల్‌గా మరియా అవతరించనున్నది. అలాగే అమెరికా, యూరప్‌ను కలుపుతూ ఏర్పాటవుతోన్న తొలి కేబుల్ కూడా ఇదే. కేబుల్ ఏర్పాటు వర్జీనియా బీచ్ (అమెరికా) నుంచి బిల్బావు (స్పెయిన్) వరకు జరగనున్నది.
2017 నాటికి పూర్తి: కేబుల్ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం అవుతాయని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇక కేబుల్ ఏర్పాటు 2017 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని పేర్కొన్నాయి.