
హైదరాబాద్: నవయుగ కంటెయినర్ టర్మినల్ (ఎన్‌సీటీ) సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2018–19లో 5,00,000 టీఈయూల (భారీ ఓడల నిర్వహణ సామర్థ్యాన్ని లెక్కించే కొలమానం) హ్యాండ్లింగ్‌ను 2019 మార్చి 27న తొలిసారిగా చేరుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఎం.వి ఎస్‌ఎస్‌ఎల్ కుచ్ వెస్సెల్ ద్వారా దీన్ని సాధించినట్టు తెలిపింది. 2013–14లో 58,577 టీఈయూల సామర్థ్యం నుంచి చూస్తే ఐదేళ్ల కాలంలో 9 రెట్ల వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది.
కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ సీఈవో, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి దీనిపై మాట్లాడుతూ... నవయుగ కంటెయినర్ టర్మినల్ భారత తూర్పు తీరంలో రవాణా హబ్‌గా అవతరించేందుకు భారీ ముందగుడు వేసినట్టు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో దీన్నొక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. షిప్పింగ్ లైన్స్‌తో బలమైన భాగస్వామ్యాలు లేకుండా ఈ ప్రగతి సాధ్యమయ్యేది కాదని నవయుగ కంటెయినర్ టర్మినల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి జితేంద్ర నిమ్మగడ్డ అభివర్ణించారు. టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1.2 మిలియన్ టీఈయూల నుంచి 2019 చివరి నాటికి 2 మిలియన్ల టీఈయూలకు పెంచనున్నట్టు చెప్పారు.