వీవీఐపీల ఫోన్ ట్యాపింగ్ సంచలనం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి, న్యాయవాదుల వరకు ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే వార్త ఇపుడు సంచలనం మారింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ 2001-06 మధ్య కాలంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడిందని ఓ సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన పిల్ కూడా దాఖలు చేశారు. క్యాబినెట్ మంత్రులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వేత్తలు, ప్రముఖ న్యాయవాదుల ఫోన్ల ను ఎస్సార్ సంస్థ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ దీనిపై 29 పేజీల పిర్యాదు చేశారని కథనాలు తెలుపుతున్నాయి.
ఈ ఫిర్యాదు మేరకు ఎస్సార్ మాజీ ఉద్యోగి అల్ బాసిత్ ఖాన్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సార్ సంస్థలో భద్రతా అధిపతిగా చేసే కాలంలో ఖాన్ ప్రముఖుల ఫోన్లకు అంతరాయం కలిగిస్తూ వారి సంభాషణలను రికార్డు చేసేవాడని, మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు అతను ఈ చర్యలకు పాల్పడినట్టు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు యథేచ్చగా సాగిన ఈ వ్యవహారం, 2011 మేలో తేడా వచ్చి, ఖాన్ ను సంస్థ నుంచి బయటికి పంపేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ పరిమాణానికి షాకైన ఖాన్ తన దగ్గరున్న టేపులను బయటపెట్టాలనుకున్నాడని, తనను కలిసేందుకు కూడా ప్రయత్నించాడని న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం ఖాన్ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఫోన్లకు, మెసేజ్ లకు అతను అందుబాటులో లేడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ విషయాలపై మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది.
అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ ను ఎస్సార్ సంస్థ ఖండిస్తోంది. న్యాయవాది స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు దీనికి ఆధారాలే లేవని ఎస్సార్ సంస్థ పేర్కొంది. అతని డిమాండ్లను సంస్థ నెరవేర్చకపోవడం వల్లే, ఇలా నిందలు వేస్తున్నారని మండిపడింది. అసలు ఎస్సార్ సంస్థ ఎవరి పోన్లపై ఎప్పుడు నిఘా ఉంచలేదని, దీనికోసం అసలు వ్యక్తులనే నియమించలేదని తెలిపింది.
ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మాజీ మంత్రి ప్రఫూల్ పటేల్, రామ్ నాయక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ, కంపెనీల్లోని వివిధ ప్రముఖ అధికారులు, మాజీ కేబినెట్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎంపీ అమర్ సింగ్ ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాని తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా చాలామందే ప్రముఖులున్నట్టు సమాచారం.ఈ ట్యాపింగ్ వ్యవహరంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఓ దిగ్భ్రాంతికరమైన వ్యవహారమని, ప్రైవేట్ సర్వీసు ప్రొవేడర్లు చేసే ఈ చర్యలు దేశ రక్షణకు, భద్రతకు హానికరమని జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ అన్నారు.