రూపాయి, విదేశీ ఇన్వెస్టర్లే కీలకం
ముడిచమురు ధర కదలికలు కూడా...
* ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా..
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల కదలికలతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి... ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకం కానున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఇప్పటికిప్పుడు మన మార్కెట్లను అత్యంత ప్రభావితం చేసే కీలకాంశాలేవీ(ట్రిగ్గర్స్) లేకపోవడమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే కదలికలపై కూడా దేశీ మార్కెట్లు దృష్టిసారించనున్నాయని వారు చెబుతున్నారు.
ఇక 2016 కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే సంస్కరణల పక్రియ, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లలో మొదలవుతాయని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వారం కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉందని.. దీంతో సూచీల కదలికలు అక్కడక్కడే ఉండొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్ ఇంకా పటిష్టంగానే కొనసాగుతోందన్నారు.
మరోపక్క, డిసెంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలకు అనుగుణంగా సోమవారం ఆటోమొబైల్ స్టాక్స్ స్పందించే అవకాశం ఉంది. గత నెలలో అమ్మకాలు మెరుగైన స్థాయిలో నమోదైన సంగతి తెలిసిందే. ఇక సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) డేటా కూడా ఈ వారంలో విడుదల కానుంది. దీని ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండొచ్చని నిపుణులు చెప్పారు.
‘గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు, రూపాయి, ముడిచమురు రేట్లు సమీప కాలంలో మాన మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు భారత్‌పై ఎలాంటి ధోరణిని అనుసరిస్తారనేదే రానున్న కాలంలో మన మార్కెట్‌కు కీలకంగా నిలుస్తుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
ఇక కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా స్వల్పకాలికంగా కీలకమైన అంశమేనని చెప్పారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల లాభాలు పుంజుకోవచ్చన్న విశ్వాసం మెండుగా ఉన్న నేపథ్యంలో మార్కెట్లు క్రమంగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. దీనికి ఆర్థిక వ్యవస్థ పటిష్టత ప్రధానంగా దోహదం చేయనుంది’ అని కోటక్ సెక్యూరిటీస్ సీఈఓ కమలేష్ రావు పేర్కొన్నారు.
గత వారం మార్కెట్...
దేశీ మార్కెట్లు గత వారం కూడా లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు ఎగబాకి 26,161 వద్ద స్థిరపడింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 7,963 వద్ద ముగిసింది. గడిచిన ఏడాది(2015) మొత్తంమీద చూస్తే సెన్సెక్స్ 1,382 పాయింట్లు(5 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే.
బాండ్‌లలో పడిపోయిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గతేడాది దేశీ డెట్ మార్కెట్లో(బాండ్‌లు) చేసిన నికర పెట్టుబడులు భారీగా దిగజారాయి. 2015 మొత్తంలో కేవలం 7.4 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.45,856 కోట్లు) మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. 2014లో ఈ పెట్టుబడుల విలువ 26 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.6 లక్షల కోట్లు) కావడం గమనార్హం.
ఇక స్టాక్స్‌లో కూడా అత్యంత తక్కువ స్థాయిలో నికరంగా 17,806 కోట్లను మాత్రమే గతేడాది ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం మూడేళ్లలో వరుసగా దాదాపు రూ. లక్ష కోట్ల చొప్పున ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమనం, చైనాలో స్టాక్ మార్కెట్ల పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటివి ఎఫ్‌పీఐల పెట్టుబడులపై ప్రభావం చూపాయనేది విశ్లేషకుల అభిప్రాయం.