
రూపాయి బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. స్టాక్ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. ఆద్యంతం స్తబ్దుగా, ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 36,725 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,058 పాయింట్ల వద్ద ముగిశాయి,. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌మొత్తం 858 పాయింట్లు పెరిగింది. గత మూడు రోజుల లాభాల కారణంగా పెరిగిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరిగినప్పటికీ, స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కీలకమైన స్థాయిలపైననే ముగియగలిగాయి.
239 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...
డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాలు కొనసాగాయి. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. స్వల్ప కాలమే స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్ మళ్లీ లాభాల బాట పట్టింది. ఒక దశలో 45 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 194 పాయింట్ల వరకూ లాభపడింది.రోజంతా 239 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ముడి చమురు ధరలు ఒక శాతం మేర పెరగడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది.
► దేశీయ సంస్థల నుంచి భారీ ఆర్డర్లు సాధించడంతో ఎల్‌అండ్ టీ షేర్ 2.7 శాతం లాభపడి రూ.1,351 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే.
► డాలర్‌తో రూపాయి మారకం రెండు నెలల గరిష్టానికి చేరడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి.
► పంచదార మిల్లులకు అదనపు నిధులు కేటాయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సంబంధిత షేర్లు పరుగులు పెట్టాయి.