మార్కెట్లకు యూరోజోన్ షాక్ | Sensex ends day 431 points down: 5 reasons why markets cracked | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు యూరోజోన్ షాక్

Published Wed, Sep 24 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

మార్కెట్లకు యూరోజోన్ షాక్

మార్కెట్లకు యూరోజోన్ షాక్

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలపై నీళ్లు చల్లుతూ వెలువడ్డ యూరోజోన్ పారిశ్రామిక రంగ గణాంకాలు భారత్‌సహా యూరప్ స్టాక్ మార్కెట్లను వణికించాయి. మరోవైపు చైనాలో నిరుద్యోగం పెరుగుతున్న సంకేతాలు ఆసియా మార్కెట్లకు దడపుట్టించాయి. ఇవిచాలవన్నట్లు సిరియాపై అమెరికా వైమానికదాడులు చేపట్టడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌తిన్నారు.

దీంతో భారత్‌సహా ఆసియా, యూరప్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. గత రెండున్నర నెలల్లోలేని విధంగా సెన్సెక్స్ 431 పాయింట్లు పతనమైంది. 27,776 వద్ద ముగిసింది.

 ఇప్పట్లో వడ్డీ పెంపు ఆలోచనలేదంటూ వర్థమాన మార్కెట్లకు ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన జోష్ ఒక్క రోజులోనే ఆవిరైంది. సెస్టెంబర్‌లో యూరోజోన్ ప్రయివేట్ రంగ బిజినెస్ మందగించిన సంకేతాలకుతోడు, సిరియాపై అమెరికా వైమానికదాడులకు దిగడంతో సెంటిమెంట్‌కు ఎదురు దెబ్బతగిలింది. మరోపక్క సెప్టెంబర్ నెలకు చైనాలో తయారీ రంగం పుంజుకుంటున్న సంకేతాలు కనిపించిప్పటికీ, ఉపాధి కల్పన ఐదున్నరేళ్ల కనిష్టానికి పడిపోవడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి.

దీంతో మంగళవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు తెరలేచింది. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. గత రెండున్నర నెలల్లోలేని విధంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 129 పాయింట్లు దిగజారింది. 8,017 వద్ద నిలిచింది. ఇక బీఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.5-5% మధ్య కుప్పకూలగా, ఎక్స్ఛేంజీలలో మొత్తం రూ. 6 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ గురువారం ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు భారీ స్థాయిలో అమ్మకాలు చేపట్టారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది కూడా సెంటిమెంట్‌ను బలహీరపరిచిందని తెలిపారు.

 అన్నింటా అమ్మకాలే...
►తొలుత సెన్సెక్స్ 27,257 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ, ఒక దశలో 26,744కు పడిపోయింది. సెన్సెక్స్ ఇంతక్రితం జూలై 8న మాత్రమే ఈ స్థాయిలో 518 పాయింట్లు పడింది.

 ►ఇటీవల దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్‌చేస్తూ వచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా రూ. 1,185 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 326 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
 
►సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 5% పతనంకాగా, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, భెల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్, సన్ ఫార్మా, భారతీ 4-2% మధ్య క్షీణించాయి.
 
►రియల్టీ రంగం అత్యధికంగా 5% తిరోగమించింది. యూనిటెక్, అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్, డీబీ, ఫీనిక్స్, గోద్రెజ్, ఒబెరాయ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ 11-3% మధ్య కుప్పకూలాయి.
 
►ఆయిల్ రంగానికి చెందిన షేర్లలో ఐవోసీ, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, గెయిల్, క్యాస్ట్రాల్ 4-2% మధ్య నీరసించాయి.
 
►ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ. 1.63 లక్షల కోట్లమేర కరిగిపోయింది.
 
►మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2-2.5% మధ్య పడిపోగా, ట్రేడైన షేర్లలో ఏకంగా 2,148 నష్టపోయాయి. కేవలం 875 షేర్లు లాభపడ్డాయి.
 
►మిడ్ క్యాప్స్‌లో సుజ్లాన్, హాట్సన్, నాల్కో, రెయిన్, ఇండియా సిమెంట్స్, డెల్టాకార్ప్, జెన్‌సర్, ఈరోస్, వెల్‌స్పన్ కార్ప్, ఓబీసీ, ఫ్యూచర్ లైఫ్, దాల్మియా భారత్ 10-6% మధ్య దిగజారాయి.  
 
►మార్కెట్లో రూ.6 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement