
స్వల్పశ్రేణిలో షేర్ల కదలికలు!
ఇన్వెస్టర్ల పొజిషన్లు అంతంతే...
సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల డేటా నేపథ్యంలో అప్రమత్తత
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: సంవత్సరాంతపు రోజులు కావడంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ పొజిషన్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని... దాంతో ఈ వారం షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. అలాగే సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీల డిసెంబర్ నెల అమ్మకపు గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పారు. 2014లో ఇప్పటివరకూ 30% పెరిగిన బీఎస్‌ఈ , సెన్సెక్స్, ఎన్ ఎస్‌ఈ నిఫ్టీలు ఈ సంవత్సరాంతపువారంలో కన్సాలిడేట్ కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
విదేశీ పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపవచ్చని వారు వ్యాఖ్యానించారు. ఈ వారం జనవరి 2న హెచ్‌ఎస్‌బీసీ తయారీ సూచీకి సంబంధించిన డేటా వెల్లడవుతుందని, దీనికి తోడు డిసెంబర్ నెలకు సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీలు సేల్స్ డేటా వెలువడుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మలిక్ చెప్పారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, రూపాయి కదలికలు సమీప భవిష్యత్తులో మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని క్యాపి టల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అన్నారు.
ఈ వారం మార్కెట్ స్వల్పశ్రేణిలో కదలవచ్చని, మధ్యకాలికంగా నిఫ్టీ 8,100-8,550 మధ్య ట్రేడ్‌కావొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ అంచనావేశారు. 2015 జనవరి రెండోవారం నుంచి వెలువడే కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు మార్కెట్లను భారీగా కదల్చవచ్చని నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక చరిత్రలో 2015 ఏడాది ప్రధానమైనదిగా నిలుస్తుందని, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే పలు సంస్కరణలు అమలవుతాయని అంచనావేస్తున్నట్లు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఫండ్ మేనేజర్ నిలేష్ షెట్టి చెప్పారు.
2 బిలియన్ డాలర్లకు ఎఫ్‌ఐఐ పెట్టుబడులు
డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు దాదాపు 2 బిలియన్ డాలర్లకు చేరాయి. డిసెంబర్ 1-26 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్లో వారి పెట్టుబడులు 116 మిలియన్ డాలర్ల (రూ. 553 కోట్లు) మేర ఉన్నాయి. రుణ మార్కెట్లో ఇవి 1.94 బిలియన్ డాలర్లకు (రూ. 12,065 కోట్లు) చేరినట్లు సెబి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం ఎఫ్‌ఐఐ పెట్టుబడులు 42 బిలియన్ డాలర్లకు (రూ.2.56 లక్షల కోట్లు) పెరిగాయి. ఈక్విటీల్లో 16 బిలియన్ డాలర్లు (రూ. 96 వేల కోట్లు) రుణపత్రాల్లో 26.4 బిలియన్ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్లు) చొప్పున వారు పెట్టుబడి చేశారు.