పెట్టుబడులకు ఆకాశమే హద్దు
బీజింగ్ : భారతదేశంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. చైనాలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ బీజింగ్ లో చైనీస్ ప్రభుత్వం నిర్వహించే సీసీటీవీతో మాట్లాడారు. ఆర్థికవృద్ధి పరంగా భారతదేశం నిలకడగా ఉందని.. మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ, హౌసింగ్, విద్యుత్, నీరు మరియు సామాజిక రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు.
భారత ఆర్థిక వ్యవస్థ పుంచుకుంటోందని చెప్పగలననీ, ప్రయివేట్ రంగ పెట్టుబడులు దీనికి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నాయని తెలిపారు. తమ దేశంలో పెట్టుబడులకు ఆకాశమే పరిమితి... ఆస్థాయిలో పెట్టుబడులు తమకు అవసరమని ఆర్థిక మంత్రి చెప్పారు. వర్షపాతమే కీలక అంశంగా ఉన్న తమ దేశంలో గత రెండేళ్లుగా సాధారణ వర్షపాత పరిస్థితులు నమోదవుతున్నా ..గణనీయమైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలు కురిస్తే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. గత సంవత్సరం 7.6 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఆశాజనక వర్షాలు కురిస్తే ఈ పరిస్థితిలో కచ్చితంగా మెరుగుదల ఉంటుందని జైట్లీ ఉద్ఘాటించారు. 6.9 శాతం వృద్ధి రేటుతో వున్న చైనాను గత ఏడాది భారతదేశం అధిగమించిందన్నారు. అధిక జనాభా కలిగి భారత ఆర్థికవ్యవస్థలో ఉద్యోగ వృద్ధి రేటుచాలా ముఖ్యమన్నారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలపై మాట్లాడిన జైట్లీ ఎంతకాలం ఇది (గ్లోబల్ మాంద్యం) కొనసాగుతుందో.. ప్రపంచంలో ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుందో, ప్రపంచంలో వృద్ధి తిరిగి ఎలా వస్తుందో చూడాలనీ. ఇదొక అనివార్యమైన పరిస్థితి అని చెప్పారు. చైనా మద్దతిస్తున్న ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) గవర్నర్ల బోర్డు సమావేశఃలో కూడా జైట్లీ పాల్గొన్నారు.