4% పెరగనున్న చక్కెర ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది చెరకు సాగు రెండు శాతం తగ్గినా పంచదార ఉత్పత్తిలో మాత్రం నాలుగు శాతం వృద్ధి నమోదవుతుందని ఇండియన్ షుగర్ అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ) ప్రాథమికంగా అంచనా వేసింది. 2014-15 (అక్టోబర్-సెప్టెంబర్) ఏడాదికి పంచదార ఉత్పత్తి నాలుగు శాతం పెరిగి 2.43 కోట్ల టన్నుల నుంచి 2.53 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 75 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉండటం, ఉత్పత్తి పెరగనుండటంతో డిమాండ్‌కు ఇబ్బంది ఉండదని అంచనా వేసింది.
దేశంలో ఈ ఏడాది 2.4 కోట్ల టన్నుల పంచదార అవసరమవుతుందని అంచనా. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు సరిగా కురవకపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం రెండు శాతం తగ్గే అవకాశం ఉందని ఐఎస్‌ఎంఏ చెపుతోంది. ఉపగ్రహ మ్యాప్‌లు ఆధారంగా చూస్తే గతేడాది కంటే రెండు శాతం తక్కువగా 52.3 లక్షల హెక్టార్లలో చెరకు సాగు అవుతుందని లెక్కకట్టింది.