
గ్రాసిమ్‌లో ఆదిత్య బిర్లా విలీనం
అతి పెద్ద డైవర్సిఫైడ్ కంపెనీ అవతరణ
వాటాదారులకు మరింత విలువ చేకూర్చడానికే
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకోనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం కానున్నాయి. ఆదిత్య బిర్లా నువో (ఏబీఎన్‌ఎల్) కంపెనీ... గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో విలీనం కానుంది. ఈ విలీనం కారణంగా రూ.60వేల కోట్ల డైవర్సిఫైడ్ సంస్థ అవతరిస్తుంది. ఈ విలీన ప్రణాళికను ఆదిత్య బిర్లా నువో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ల డెరైక్టర్ల బోర్డ్‌లు ఆమోదించాయి. ఈ విలీనం వల్ల వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన విలీన ప్రణాళిక వివరాల ప్రకారం..,
అతి పెద్ద డైవర్సిఫైడ్ కంపెనీల్లో ఒకటి...
ఈ విలీనం కారణంగా భారత్‌లో అతి పెద్దదైన, డైవ ర్సిఫైడ్ కంపెనీల్లో ఒకటిగా విలీన కంపెనీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నిలుస్తుందని బిర్లా చెప్పారు. నిలకడైన నగదు ప్రవాహాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే సంస్థగా అవతరిస్తుందన్నారు. తయారీ రంగం నుంచి సేవల రంగం వరకూ వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుందని, దేశీయ వృద్ధికి తోడ్పాటునందించగలదని చెప్పారాయన. విలీనాంతరం, రూ.60 వేల కోట్ల టర్నోవర్‌తో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ భారత్‌లోనే అగ్రశ్రేణి సిమెంట్ కంపెనీగా, అగ్రశ్రేణి పది డైవ ర్సిఫైడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటిగా, నాలుగో అతి పెద్ద ప్రైవేట్ జీవిత బీమా, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా, మూడో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరిస్తుంది. ఈ కంపెనీ ఇబిటా రూ.11,961 కోట్లుగా ఉంటుందని అంచనా. విలీనాంతరం ఏర్పడే కంపెనీలో 17 శాతం వాటా ప్రమోటర్లకు, 57 శాతం వాటా గ్రాసిమ్ కంపెనీకి, మిగిలిన 26 శాతం వాటా ప్రజల వద్ద ఉంటుంది. ఈ లావాదేవీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో గానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో గానీ పూర్తికావచ్చు. మరోవైపు రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 2 ముఖ విలువగల ఐదు షేర్లుగా విభజించాలని గ్రాసిమ్ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది.
ఇదీ... విలీన ప్రణాళిక
ఆదిత్య బిర్లా నువోకు చెందిన ఆర్ధిక సేవల వ్యాపారాన్ని ఈ కంపెనీ పూర్తి అనుబంద సంస్థ, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్(ఏబీఎఫ్‌ఎస్‌ఎల్)లో విలీనం చేస్తారు. తర్వాతి కాలంలో(వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో) ఈ ఏబీఎఫ్‌ఎస్‌ఎల్ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది.
ఆదిత్య బిర్లా నువో కంపెనీని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేస్తారు. ఫలితంగా ప్రతి పది ఆదిత్య బిర్లా నువో షేర్లకు మూడు గ్రాసిమ్ ఈక్విటీ షేర్లు లభిస్తాయి. విలీనాంతరం ఏర్పడే గ్రాసిమ్ షేర్లున్న వాటాదారులకు ప్రతి ఒక్క గ్రాసిమ్ ఈక్విటీ షేర్‌కు ఏడు ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఏబీఎఫ్‌ఎస్‌ఎల్) షేర్లు లభిస్తాయి. అంటే ప్రతి పది ఆదిత్య బిర్లా నువో షేర్లకు మూడు గ్రాసిమ్ షేర్లు, 21 ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు లభిస్తాయి. ఈ విలీన ప్రతిపాదనకు స్టాక్ ఎక్స్చేంజీల, మధ్య ప్రదేశ్, గుజరాత్ హైకోర్టుల, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది.
ఇటీవలే ఆరోగ్య బీమాకు అనుమతి!
ఆరోగ్య బీమా వ్యాపారం నిర్వహించడానికి ఆదిత్య బిర్లా నువోకు ఇటీవలే ఆమోదం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. ఆదిత్య బిర్లా నువో కంపెనీ సోలార్, చెల్లింపుల బ్యాంకు, ఆరోగ్య బీమా వ్యాపారాల్లోకి ప్రవేశిస్తుంది. కొత్తగా ఏర్పడే ఏబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఐడియా సెల్యులర్ రుణభారంతో ఎలాంటి సంబంధం ఉండదు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు నికరంగా ప్రస్తుతం రూ.460 కోట్ల నగదు నిల్వలున్నాయి.
ఈ విలీన వార్తల కారణంగా బీఎస్‌ఈలో ఆదిత్య బిర్లా నువో షేర్ 3.5 శాతం(రూ.53) లాభపడి రూ.1,566 వద్ద, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్ 6.4 శాతం(రూ.312) క్షీణించి రూ.4,539 వద్ద ముగిశాయి.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్
1948లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టెక్స్‌టైల్ కంపెనీగా ప్రారంభమైంది. ప్రస్తుతం విస్కోస్ స్టేపుల్ ఫైబర్ తయారీ, సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఆదాయంలో 90 శాతం సిమెంట్ వ్యాపారం నుంచే వస్తోంది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ, అల్ట్రాటెక్ సిమెంట్ భారత్‌లోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ.
ఆదిత్య బిర్లా నువో
ఆర్థిక సేవలు, జీవిత బీమా, సౌర శక్తి సంబంధిత వ్యాపారం, టెలికం, లినన్, వ్యవసాయ, రేయాన్, ఇన్సులేటర్ల సెగ్మెంట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐడియాలో 23 శాతం వాటా ఉంది.