వొడాఫోన్‌.. విలీనం ‘ఐడియా’! | Vodafone talks merger with Idea Cellular in India | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌.. విలీనం ‘ఐడియా’!

Published Tue, Jan 31 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

వొడాఫోన్‌.. విలీనం ‘ఐడియా’!

వొడాఫోన్‌.. విలీనం ‘ఐడియా’!

భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావం

వొడాఫోన్, ఐడియా విలీనానికి చర్చలు...
పూర్తిగా షేర్ల రూపంలో డీల్‌కు అవకాశం
ధ్రువీకరించిన వొడాఫోన్‌...
విలీనం పూర్తయితే ఉమ్మడి కంపెనీకి దాదాపు 40 కోట్ల మంది యూజర్లు
30 శాతం దూసుకెళ్లిన ఐడియా షేరు ధర  


న్యూఢిల్లీ: భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ ఐడియా సెల్యులార్‌లు ఒక్కటవుతున్నాయి. చాన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ... ఐడియాతో విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయని వొడాఫోన్‌ గ్రూప్‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. షేర్ల రూపంలో జరిగే ఈ లావాదేవీగనుక పూర్తి అయితే, దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించనుంది. రిలయన్స్‌ జియోతో టారిఫ్‌ల యుద్ధం పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో దేశీ టెలికం రంగంలో స్థిరీకరణ(కన్సాలిడేషన్‌) ఊపందుకుంటుండటం గమనార్హం.

ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా...
ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా వొడాఫోన్‌ ప్రస్తుతం పటిష్టమైన స్థానంలో ఉంది. భారత్‌లోనూ రెండో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఇక ఐడియా సెల్యులార్‌ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ విలీనం ద్వారా ఏర్పాటయ్యే కంపెనీకి 39 కోట్ల మందికి పైగా యూజర్లు ఉంటారు. తద్వారా దేశంలో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకోవడంతోపాటు, ప్రపంచంలోని అతిపెద్ద టెల్కోల్లో ఒకటిగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా 24 కోట్ల

మందికి పైగా యూజర్లతో భారతీ ఎయిఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వొడాఫోన్‌–ఐడియా విలీన సంస్థకు వార్షిక ఆదాయం రూ.78,000 కోట్లు, మార్కెట్‌ వాటా 43 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.50,008 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ వాటా 33 శాతం. కాగా, కొత్తగా 4జీ సేవలను ఆరంభించిన ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో... ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌ను మార్చి 31 వరకూ పొడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం 7.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.

టవర్ల వ్యాపారానికి మినహాయింపు...
షేర్లరూపంలో జరిగే ప్రతిపాదిత డీల్‌ ఇంకా సంప్రదింపుల దశలో ఉందని వొడాఫోన్‌ పేర్కొంది. అయితే, ఇండస్‌ టవర్స్‌ జాయింట్‌ వెంచర్‌లో తమకున్న 42 శాతం వాటాను ఈ ఒప్పందంలో చేర్చబోమని తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్, ఐడియాతో కలిసి టవర్ల వ్యాపారం కోసం వొడాఫోన్‌ ఇండస్‌ టవర్స్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌(జేవీ)ను ఏర్పాటు చేసింది. ‘ఐడియా నుంచి వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేసేవిధంగానే విలీన ఒప్పందం ఉంటుంది. దీనివల్ల భారత్‌లో మా కార్యకలాపాల నుంచి వైదొలిగేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత ఒప్పందం కుదురుతుందనిగానీ, ఎప్పటికల్లా డీల్‌ కుదరవచ్చు లేదా నిబంధనలు తదితర అంశాలపై ఎలాంటి కచ్చితత్వం లేదు’ అని వొడాఫోన్‌ గ్రూప్‌ పేర్కొంది.

కేసులే కారణమా?
2007లో వొడాఫోన్‌ గ్రూప్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి ‘హచ్‌’ టెలికంలో హచిసన్‌ ఎస్సార్‌ జాయింట్‌ వెంచర్‌కు ఉన్న 67 శాతం వాటాను సుమారు 13.1 బిలియన్‌ డాలర్లకు(హచ్‌కు ఉన్న 2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని కలిపితే) కొనుగోలు చేసింది. అప్పటి నుంచీ దేశంలో నంబర్‌ 2 టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్‌ కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ డీల్‌కు సంబంధించి 2 బిలియన్‌ డాలర్ల పన్ను చెల్లించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెట్రోస్పెక్టివ్‌ పన్ను(పాత ఒప్పందాలకూ పన్ను వర్తింపు) నిబంధనలతో వొడాఫోన్‌ న్యాయపోరాటాన్ని ఆరంభించింది. ఈ కేసులో మన సుప్రీం కోర్టు కూడా వొడాఫోన్‌కు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై ఇంకా న్యాయవివాదం నడుస్తూనే ఉంది. కాగా, గతేడాది భారతీయ వ్యాపార ఆస్తుల విలువలో 5 బిలియన్‌ పౌండ్లను(దాదాపు 3.35 బిలియన్‌ డాలర్ల) వొడాఫోన్‌ తగ్గించుకుంది(రైటాఫ్‌) కూడా. భారతీయ కార్యకాలాపాలపై వొడాఫోన్‌ 7 బిలియన్‌ డాలర్లకుపైగానే పెట్టుబడిగా వెచ్చించింది.ట్యాక్స్‌ కేసుల నేపథ్యంలో భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా కష్టమంటూ వొడాఫోన్‌ ఎప్పటినుంచో చెబుతూవస్తోంది. ఈ తరుణంలో ఐడియాతో విలీనం తెరపైకి వచ్చింది.

సర్దుకుంటున్న విదేశీ కంపెనీలు...
స్పెక్ట్రం కుంభకోణం తర్వాత నెమ్మదిగా విదేశీ టెల్కోలు భారత్‌ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన సిస్టెమా ఆర్‌కామ్‌లో కలిసిపోయేందుకు ఒప్పందం కుదరింది. ఎయిర్‌సెల్‌ కూడా ఆర్‌కామ్‌తో విలీనం అవుతోంది. మరోపక్క, నార్వే కంపెనీ టెలినార్‌ కూడా ఇక్కడ తమకు సరైన వ్యాపార పరిస్థితులు కనబడటం లేదని... అవకాశం వస్తే భారత్‌కు గుడ్‌బై చెప్పేసేందుకు సిద్ధంగా ఉంది.

ఇబ్బందులు తప్పవు...
ప్రతిపాదిత విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) ఆమోదం చాలా కీలకం. దీనికోసం విలీనం తర్వాత ఏర్పడే సంస్థ గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, కేరళ, ఉత్తర ప్రదేశ్‌(పశ్చిమం) సర్కిళ్లలో స్పెక్ట్రంను వదిలేసుకోవాల్సి ఉంటుంది.

మరోపక్క, టవర్‌ కంపెనీ ఇండస్‌లో వాటాలను పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం దీనిలో భారతీ, వొడాఫోన్‌లకు 42 శాతం చొప్పున, ఐడియాకు 16 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత టవర్లకు సంబంధించి అద్దెలు తగ్గడంతో ఇండస్‌ విలువపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.

ఇరు కంపెనీల యాజమాన్యాలు కలిసే విషయంలో వాటాల పంపకం, ఇతరత్రా కొన్ని అవాంతరాలు, రిస్కులకు ఆస్కారం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌కల్లా విలీనం పూర్తయ్యే అవకాశం ఉంది.

షేరు రయ్‌ రయ్‌...
వొడాఫోన్‌తో విలీనం వార్తల నేపథ్యంలో ఐడియా సెల్యులార్‌ షేరు ధర దూసుకుపోయింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ఒకానొక దశలో 29.2 శాతం ఎగబాకి రూ.100.5 స్థాయిని తాకింది. చివరకు 26 శాతం లాభపడి రూ.97.95 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 26శాతం లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. స్టాక్‌ మార్కెట్లో ఐడియా లిస్టింగ్‌ తర్వాత కంపెనీ షేరు విలువ ఒకే రోజు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. షేరు ర్యాలీతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే రూ.7,257 కోట్లు పెరిగి... రూ.34,279 కోట్లకు చేరింది. కాగా, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ రూపంలో జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు సోమవారం స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఐడియా వెల్లడించింది.

ఐడియా సంగతిదీ...
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీల్లో ఐడియా సెల్యులార్‌ కీలకమైనది. ప్రస్తుతం ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 42.2 శాతం వాటా ఉంది. మలేసియాకు చెందిన యాక్సిటా గ్రూప్‌నకు 19.8 శాతం వాటా ఉండగా.. మిగిలినది ఇతర ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. 2007లో వొడాఫోన్‌ భారత్‌లోకి అడుగుపెట్టినప్పుడే ఐడియా సెల్యులార్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుతం ఐడియా సెల్యులార్‌కు 19 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉన్నారు. నంబర్‌ 3 స్థానంలో ఉంది. మార్కెట్‌ వాటా దాదాపు 20 శాతం. కాగా, ఐడియాకు ప్రస్తుతం రూ. 55,000 కోట్లకుపైగానే రుణ భారం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 88 శాతం పడిపోయి రూ.762 కోట్ల నుంచి రూ.91 కోట్లకు దిగజారింది. డిసెంబర్‌ క్వార్టర్‌(క్యూ3) ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది.

వొడాఫోన్‌ ఇండియా...
వొడాఫోన్‌ గ్రూప్‌నకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా వొడాఫోన్‌ ఇండియా ఉంది. వొడాఫోన్‌కు భారత్‌లో యూజర్ల సంఖ్య 20.1 కోట్లు. గతేడాది సెప్టెంబర్‌ నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.76,800 కోట్లు. అయితే, నవంబర్‌లో మాతృ సంస్థ వొడాఫోన్‌ గ్రూప్‌ నుంచి రూ.47,700 కోట్లు పెట్టుబడి రావడంతో రుణ భారం రూ.35,430 కోట్లకు దిగొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో కంపెనీ మార్కెట్‌ వాటా 23 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement