
న్యూ ఢిల్లీ: ఇంట్లో ఉన్నప్పుడు చేతులు కడుక్కునేందుకు సాధారణంగా సబ్బు వినియోగిస్తాం. బయట ఉన్నప్పుడైతే శానిటైజర్ వాడుతాం. అది సరే.. మరి ఫోన్లను శుభ్రం చేసేందుకు..? శానిటైజర్ ఉపయోగిస్తే స్క్రీన్ పాడైపోతుందేమోనని భయపడిపోతాం. కానీ మార్కెట్లో వచ్చిన కొత్తరకాల శానిటైజర్‌లతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేయొచ్చు. మొబైల్ ఫోన్, ట్యాబ్‌లెట్, కంప్యూటర్, టీవీ రిమోట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను శుభ్రం చేసేందుకు మార్కెట్‌లో ఎన్నో శానిటైజర్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి. మొదటిది స్ప్రే శానిటైజర్, రెండోది యూవీ బాక్స్ శానిటైజర్. వీటిలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల గురించి గురించి తెలుసుకుందాం..
స్ప్రే శానిటైజర్: వీటి ధర 230 రూపాయల నుంచి 250 వరకు ఉంటుంది. ఈ శానిటైజర్‌ను ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్ వంటి వస్తువులపై స్ప్రే చేసి అనంతరం కాటన్ వస్త్రంతో తుడవాలి. అయితే ఇష్టమొచ్చినట్లుగా కాకుండా నెమ్మదిగా రుద్దాల్సి ఉంటుంది.
► పోరట్రానిక్స్ స్వైప్: ఇది వాడటానికే కాకుండా మీ వెంట తీసుకెళ్లడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇందులో స్ప్రేయర్‌తోపాటు శుభ్రం చేసేందుకు వీలుగా చిన్న వస్త్రాన్ని కూడా ఇస్తారు. దీని ధర 249 రూపాయలు.
► మొబివాష్ మొబైల్ శానిటైజర్: ఇది శానిటైజింగ్‌తోపాటు క్లెన్సింగ్, డియోడరైజింగ్ వంటి పనులను కూడా చేసి పెడుతుంది. దీని వెంట కూడా ఒక కాటన్ వస్త్రం వస్తుంది. పైన చెప్పిన దానిలాగే దీన్ని ఫోన్‌పై స్ప్రే చేసి సుతారంగా తుడిచేయాలి. (చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ)
యూవీ(అల్ట్రా వయొలెట్) బాక్స్ శానిజైజర్: వీటి ధర 3000 రూపాయల నుంచి 5 వేల వరకు ఉంటుంది. మీ ఫోన్‌పై ఉండే వైరస్ కణాలను నాశనం చేయాలనుకుంటే వీటిని ఎంచుకోవడమే ఉత్తమం.
♦ నైకా జెనరిక్ యూవీ-సీ పోర్టబుల్ శానిజైజింగ్ బాక్స్: పేరు చదవగానే అర్థమై ఉంటుంది. ఇది అతినీల లోహిత కిరణాలు, ఓజోన్ క్రిమిసంహారకాలను ప్రసరింపజేసి ఫోన్‌పై ఉండే బాక్టీరియా, వైరస్‌ను నాశనం చేస్తుంది. ఇందులో అరోమా థెరపీ సౌలభ్యం కూడా ఉంది. ఇది 99.9 శాతం క్రిములను సంహరిస్తుందని పేర్కొంటోంది. దీన్ని నైకా వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. దీని ధర 3,200 రూపాయలు.
♦ డెయిలీ ఆబ్జెక్ట్స్ పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ యూవీ స్టెరిలైజర్ అండ్ వైర్‌లెస్ చార్జర్: ఇది కూడా పైదానిలాగే పని చేస్తుంది. ఇక 5 నిమిషాల్లో మీ ఫోన్‌పై ఉండే సూక్ష్మ క్రిములను మటుమాయం చేస్తామని సదరు కంపెనీ చెబుతోంది. ఈ పరికరం 15 వాట్ల వరకు చార్జింగ్ అవుతుంది. దీన్ని వైర్‌లెస్‌గానూ ఉపయోగించవచ్చు. దీని ధర 4,800 రూపాయలు. ఇది మీకు కావాలనుకుంటే డెయిలీ ఆబ్జెక్ట్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆర్డర్ చేసుకోండి. (కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!)
Comments
Please login to add a commentAdd a comment