ఇవి పాటిస్తే గేటెడ్లో నిశ్చింతే!
సాక్షి, హైదరాబాద్ : గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో బిజీగా ఉంటారు. అసలు పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవటానికి సలహాలు ఇవ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసి పెద ్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకురాకపోవచ్చు. కాబట్టి నివాసితులంతా సంఘం పట్ల బాధ్యతగా మెలగాలి.
⇔ ఒక అపార్ట్‌మెంట్‌లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి, ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాసుకుంటే మంచిది.
⇔ సంఘ సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలసిమెలసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకూడదు. రాగద్వేషాలకూ తావివ్వకూడదు. నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలోని కొందరికే మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు.
⇔ నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి.
⇔ కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు వ్యక్తులు ‘తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్లుగా వ్యవహరిస్తారు. వాళ్లే కరెక్ట్.. ఇతరులు చెప్పేది తప్పని భావిస్తుంటారు. వాళ్లకు నచ్చిన అంశాన్ని ఇతరులు మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తుం టారు. కాబట్టి ఇలాంటి వారు చెప్పే అంశాన్ని లోతుగా పరి శీలించాకే నివాసితులు అంతి మ నిర్ణయానికి రావాలి.