
మొండిబకాయిల సెగ..
ఆమోదయోగ్య స్థాయిని మించిపోయాయ్
♦ పీఎస్‌బీల్లో ఎన్‌పీఏ పరిస్థితులపై
♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
♦ బ్యాంకులు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలవని ధీమా
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(పీఎస్‌బీ) మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిమాణం ఆమోదయోగ్య స్థాయిని మించిపోయాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఎన్‌పీఏలను తగ్గించేందుకు, పీఎస్‌బీల ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వివేచన లోపించడం, క్రియాశూన్యత, ఎకానమీలో కొన్ని రంగాలు సవాళ్లు ఎదుర్కొంటుండడం మొదలైనవి అన్నీ కూడా ఎన్‌పీఏల పెరుగుదలకు తలా కొంత కారణమయ్యాయని ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎస్‌బీల్లో స్థూల ఎన్‌పీఏలు రూ. 2.67 లక్షల కోట్ల మేర ఉన్నాయి. మొత్తం బ్యాంకింగ్ రంగం స్థూల ఎన్‌పీఏలు రూ. 3.09 లక్షల కోట్లు కాగా.. పీఎస్‌బీల వాటా ఆందోళనకర స్థాయిలో 86 శాతం పైగా ఉంది. కొత్త ఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా దేశీ బ్యాంకులకు మొండిబకాయిల భారం తప్పదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనాలు వేసింది.
ఎన్‌పీఎల తగ్గుదలకు చర్యలు..
ఉక్కు, విద్యుత్, డిస్కమ్‌లు, జాతీయ రహదారులు మొదలైన రంగాల్లోనే ఎక్కువగా మొండిబకాయిలు పేరుకుపోయాయని జైట్లీ చెప్పారు. కొన్ని దేశీయ, మరికొన్ని అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం రంగాలవారీగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడుతోన్నట్లు ఆయన వివరించారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకులు సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోగలవని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చడం, ప్రభుత్వం వాటికి మరింత మూలధనం సమకూర్చడం మొదలైనవన్నీ అందులో భాగమేనని జైట్లీ చెప్పారు.
ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం బ్యాంకులకు నాలుగేళ్లలో రూ. 1.80 లక్షల కోట్ల మూలధనం అవసరం కాగా.. ఇందులో ప్రభుత్వం రూ. 70,000 కోట్లు సమకూర్చనుందని ఆయన వివరించారు. ఇక, పీఎస్‌బీలకు అవసరాన్ని బట్టి అత్యుత్తమ నైపుణ్యం గలవారిని ప్రైవేట్ రంగం నుంచి కూడా రిక్రూట్ చేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఎకానమీకి ప్రాణాధారమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల అభివృద్ధికి దోహదపడేవేనని ఆయన చెప్పారు. పీఎస్‌బీలంటే ప్రజల సొమ్ముకు ట్రస్టీల్లాంటివని, అవి సరిగ్గా, సమర్థవంతంగా పనిచేయాలని ఒత్తిడి చేసే హక్కు ప్రజలకు ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు.
పేమెంట్ బ్యాంకులు ప్రజల బ్యాంకింగ్ అలవాట్లను మార్చేస్తాయ్..
ప్రతిపాదిత పేమెంట్ బ్యాంకులు.. ప్రజల బ్యాంకింగ్ అలవాట్లను, దేశీ ఎకానమీ స్వరూపాన్ని మార్చేయగలవని జైట్లీ చెప్పారు. చిన్న మొత్తాలైనా..పెద్దమొత్తాలైనా ప్రజలు ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు బ్యాంకింగ్ వ్యవస్థనే ఉపయోగిస్తారన్నారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారని ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రాబోయే రోజుల్లో బ్యాంకింగ్‌లో టెక్నాలజీ మరింత పెరుగుతుందని జైట్లీ పేర్కొన్నారు.
బ్యాంకింగ్ నెట్‌వర్క్ భారీగా విస్తరిస్తుండటం సంతోషించతగ్గదే అయినప్పటికీ.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ తదితర 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేసేం దుకు రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.