తెలంగాణలో వోల్వో ప్లాంటు..! | Volvo Auto India launches XC90 T8 at Rs 1.25 crore | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వోల్వో ప్లాంటు..!

Published Thu, Sep 15 2016 6:34 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

కొత్త కారుతో టామ్ వాన్(ఎడమ వ్యక్తి),  వోల్వో ఇండియా డెరైక్టర్ స్టెఫాన్ గ్రీన్

కొత్త కారుతో టామ్ వాన్(ఎడమ వ్యక్తి), వోల్వో ఇండియా డెరైక్టర్ స్టెఫాన్ గ్రీన్

వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డోర్ఫ్
రేసులో కర్ణాటక, చెన్నై కూడా..
మార్కెట్లోకి ఎక్స్‌సీ 90 టీ8 ఎక్స్‌లెన్స్
దేశంలోని తొలి హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇదే
ఈ ఏడాది ముగింపు నాటికి విపణిలోకి ఎస్ 90
మొత్తం అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 10 శాతం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తెలంగాణలో కార్లు, ట్రక్కుల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలను యూరోపియన్ దిగ్గజం ‘వోల్వో’ పరిశీలిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ అంతర్జాతీయ దిగ్గజం... దేశంలో తొలి ప్లాంటును ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. తెలంగాణతో పాటు కర్ణాటక, చెన్నై ప్రాంతాల్ని ప్లాంటు ఏర్పాటుకు అనువైనవిగా గుర్తించి, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డార్ఫ్ తెలియజేశారు.

‘‘ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, రాయితీలను పరిశీలించిన అనంతరం ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై తుది నిర్ణయానికి వస్తాం. ఆ తరవాతే పెట్టుబడుల వివరాలను వెల్లడించి స్థల సేకరణకు ఉపక్రమిస్తాం’’ అని బాన్స్‌డార్ఫ్ తెలియజేశారు. స్వీడన్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ‘ఐకియా’... ఇండియాలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో తొలి హైబ్రీడ్ కారు ‘ఎక్స్‌సీ90 టీ 8 ఎక్స్‌లెన్స్’ను ఆవిష్కరించిన సందర్భంగా బుధవారమిక్కడ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ వివరాలివీ...

ఆడి, బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్లతో పోలిస్తే ఇండియాలో వోల్వో అమ్మకాలు తక్కువగా ఎందుకుంటున్నాయి?
నిజమే! ఆడి, బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్లతో పోలిస్తే దేశంలో వోల్వో అమ్మకాలు తక్కువే. కారణం దేశంలో కార్ల తయారీ యూనిట్ లేకపోవటమే. ప్రస్తుతం మాకు బెల్జియం, స్వీడన్‌లో తయారీ యూనిట్లు, మలేసియా, థాయ్‌లాండ్‌లో అసెంబుల్డ్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ వోల్వో కార్లను తయారు చేసి కంప్లీట్ బిల్ట్ యూనిట్స్ (సీబీయూ) ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాం. అదే పోటీ కంపెనీలు విదేశాల నుంచి కార్ల విడిభాగాలను మాత్రమే కంప్లీట్ నాక్‌డ్ డౌన్ యూనిట్స్ (సీకేడీ) ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుని ఇక్కడి ప్లాంట్లలో అసెంబుల్ చేస్తున్నాయి. సీకేడీ కన్నా సీబీయూ దిగుమతి సుంకం రెండింతలు ఎక్కువ. ఆ లెక్కడ ఖరీదు పెరుగుతుంది కనక మా అమ్మకాలు తక్కువగా ఉన్నాయి.

మరి మీరూ ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేయొచ్చు కదా?
ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. తెలంగాణతో పాటు చెన్నై, కర్ణాటక ప్రాంతాలను పరిశీలనలో ఉన్నాయి.

 మరి ఈ అమ్మకాలు మున్ముందు పెరుగుతాయని భావిస్తున్నారా?
దేశంలో 2013-14లో 1,202, గతేడాది 1,400 లగ్జరీ కార్లను విక్రయించాం. ఈ ఏడాది ముగిసే నాటికి 2 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏటా 25-30 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. మొత్తం వోల్వో కార్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 10 శాతం వరకూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం లగ్జరీ కార్ల పరిశ్రమలో మాది 6 శాతం వాటా. 2020 నాటికి 10 శాతం వాటాతో 10 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యిస్తున్నాం.

 మార్కెట్లోకి కొత్త మోడళ్లేమైనా తెస్తున్నారా?
ప్రస్తుతం దేశంలో వోల్వో.. ఎస్ 60, ఎస్ 60 ఎస్‌క్రాస్ కంట్రీ, ఎస్ 80, వీ 40, వీ 40 క్రాస్ కంట్రీ, ఎక్స్‌సీ 60, ఎక్స్‌సీ 90 మొత్తం 7 లగ్జరీ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది ముగిసే నాటికి ఎస్ 90 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 16 షోరూమ్‌లున్నాయి. అమ్మకాలు పుంజుకోవటానికి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ షోరూమ్‌లను ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి జైపూర్, లక్నో, పుణె నగరాల్లో షోరూమ్‌లను ప్రారంభిస్తాం.

విపణిలోకి ఎక్స్‌సీ 90 టీ 8 ఎక్స్‌లెన్స్
దేశంలోని తొలి హైబ్రిడ్ ఎస్‌యూవీ
ధర రూ.1.25 కోట్లు

 దేశీయ విపణిలోకి ఎక్స్‌సీ 90 టీ 8 ఎక్స్‌లెన్స్ విడుదలైంది. దేశంలోని తొలిసారిగా హైబ్రిడ్ ఎస్‌యూవీ, రాడార్ సేఫ్టీ కారు ఇదేనని కంపెనీ తెలిపింది. ప్యూర్, హైబ్రిడ్, పవర్ మూడు రకాల డ్రైవింగ్ అవకాశాలుండటం టీ 8 ప్రత్యేకత. దీంతో మనకెలా కావాలనుకుంటే ఆ మోడ్‌లో కారును నడిపే వీలుంటుందన్నమాట. ప్యూర్‌లో.. ఒక్కసారి కారును చార్జింగ్ చేస్తే 40 కి.మీ. వరకూ ప్రయాణించొచ్చు. హైబ్రిడ్‌లో.. ఇంధన వినియోగం చాలా తక్కువగా ఉండటంతో పాటూ సీఓ2 విడుదల చాలా తక్కువ.

కి.మీ. ప్రయాణానికి 49 గ్రాముల సీవో 2ను విడుదల అవుతుంది. ఇక పవర్ మోడ్‌లో.. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోడ్ రెండూ ఉంటాయి. దీంతో కేవలం 5.6 సెకన్లలో 0-100 కి.మీ. వేగానికి చేరుకుంటాం. 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ దీని సొంతం. కారు ధర రూ.1.25 కోట్లు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో). కారు చార్జింగ్ కోసం రెండు చార్జింగ్ స్టే షన్లను కూడా అందిస్తుంది. బ్లూ, ఎలక్ట్రిక్ సిల్వర్, బ్రైట్ సిల్వర్, తెలుపు, నలుపు, గ్రే రం గులు అం దుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 50 కార్లు బుకింగ్ అయ్యాయని.. ఈ ఏడాది ముగింపు నుంచి డెలివరీ ప్రారంభిస్తామని టామ్ వోన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement